Photo Credit: Twitter
న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ధ్రువ్ జురెల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత-ఏ జట్టు 7 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (155 బంతుల్లో 99 బ్యాటింగ్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీకి పరుగు దూరంలో నిలవగా, ఆకాశ్‌దీప్ (58 బంతుల్లో 25 బ్యాటింగ్) అతడికి సహకరిస్తున్నాడు. అంతకముందు దేవదత్ పడిక్కల్ (80) తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ అర్థశతకంతో మెరిశాడు. సాయి సుదర్శన్ (41) రాణించాడు. న్యూజిలాండ్-ఏ బౌలర్లలో ఫ్రేసర్ షీట్ 4 వికెట్లతో చెలరేగగా, బ్రెట్ రాండెల్, జర్రోడ్ మెక్‌కే, జైడన్ లెన్నోక్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
జైస్వాల్ డకౌట్
ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి టెస్టులో దారుణంగా విఫలమైన ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో టెస్టులోనూ అదే ఆటతీరు ప్రదర్శించాడు. ఫ్రేసర్ షీట్ బౌలింగ్‌లో ఎల్బీ అయిన జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సున్నా పరుగుల వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
రాణించిన పడిక్కల్..
ఈ దశలో మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (41) రాణించగా, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ అర్థసెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 91 పరుగులు జోడించడంతో భారత ఇన్నింగ్స్ కాస్త కుదుటపడింది. అయితే జర్రోడ్ మెకే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయిన సాయి సుదర్శన్ అర్థసెంచరీ మిస్ చేసుకోగా, యశ్ రాథోడ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 140 బంతుల్లో 80 పరుగులు చేసిన పడిక్కల్ ప్రేసర్ షీట్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
ఆ వెంటనే స్మరణ్ రవిచంద్రన్ గోల్డెన్ డక్ కావడంతో 137 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ జురేల్ ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఆల్‌రౌండర్ సుందర్(8) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. మానవ్ సుతార్ (22) సాయంతో జురేల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మానవ్ సుతార్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్ స్వేచ్ఛగా బ్యాట్ ఝలిపించడంతో భారత్ స్కోరులో వేగం పెరిగింది. బ్యాడ్ లైట్‌తో రెండు ఓవర్ల ముందే ఆట ముగిసినట్లు అంపైర్ ప్రకటించడంతో జురేల్ 99 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Captain Dhruv Jurel stays unbeaten on 99 as India A end Day 1 of the 2nd Unofficial Test against New Zealand on 291/7 https://t.co/eImGkAViMJ
— Cricbuzz (@cricbuzz) October 31, 2026
ఇదీ చదవండి: అభిషేక్, వైభవ్‌లకు అన్యాయం చేసినట్లే అవుతుంది: యువీ


