‘ఏదైనా డైరెక్ట్‌గా చెప్పేయండి!.. కోచ్‌ నన్ను వెళ్లగొట్టాలని చూశాడు’ | It Was About Getting Me Out: India Pacer Claim On Ex State Team Coach | Sakshi
Sakshi News home page

‘ఏదైనా డైరెక్ట్‌గా చెప్పేయండి!.. కోచ్‌ నన్ను వెళ్లగొట్టాలని చూశాడు’

Oct 14 2026 3:00 PM | Updated on Oct 14 2026 3:07 PM

It Was About Getting Me Out: India Pacer Claim On Ex State Team Coach

సహచర సభ్యులతో ఉమేశ్‌ యాదవ్‌ (ఫైల్‌ ఫొటో.. PC: BCCI)

టీమిండియాకు దూరమైన బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ ఒకడు. నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసే ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌.. చివరగా 2023లో భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అయితే, ఎప్పటికైనా తిరిగి టీమిండియాలో పునరాగమనం చేస్తాననే ఆశ మాత్రం తనలో ఇంకా మిగిలే ఉందంటున్నాడు ఉమేశ్‌ యాదవ్‌.

ఏదైనా డైరెక్ట్‌గా చెప్పేయండి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఉమేశ్‌ యాదవ్‌ అక్టోబరు 25న 39వ వసంతంలో అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ‘టైమ్స్‌ నౌ’తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్‌నెస్‌ మీద మాత్రమే సెలక్షన్‌ అంశం ఆధారపడి ఉంటుంది. ఫిట్‌గా ఉంటే వయసు అనేది పెద్ద సమస్య కానేకాదు.

ఓ ఆటగాడు 37 లేదా 38 ఏళ్ల వయసులో ఉండి పరుగెత్తలేకపోయినా.. బౌలింగ్‌ సరిగ్గా చేయలేకపోయినా.. అప్పుడు సెలక్టర్లు అతడికి నేరుగా విషయం చెప్పేసేయాలి. ‘సోదరా.. నువ్విక ఇక్కడ కొనసాగలేవు. నీ బంతి మూగబోయింది. నీ బౌలింగ్‌లో పస తగ్గింది. ఫీల్డింగ్‌ కూడా చేయలేకపోతున్నావు.

గతంలో మాదిరి ఫిట్‌గా లేవు. కాబట్టి నువ్విక దయచేయవచ్చు’ అని స్పష్టంగా, నేరుగా విషయం చెప్పేయాలి. అంతేతప్ప జట్టుకు ఎంపిక చేస్తామనేలా సంకేతాలు ఇస్తూ ఆశలు కల్పించడం సరికాదు. ముసుగులో గుద్దులాట లేకుండా.. సెలక్టర్లు కచ్చితంగా ఇదీ విషయం అని చెప్పేస్తే భవిష్యత్‌ ప్రణాళికలు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

రీఎంట్రీ ఇవ్వాలని అందరికీ ఉంటుంది
ఏదేమైనా ప్రతీ ఆటగాడికి తిరిగి జాతీయ జట్టులోకి రావాలని.. దేశం తరఫున ఆడాలనే కోరిక ఉంటుంది. అయితే, సెలక్టర్ల నుంచి స్పష్టమైన సందేశం వస్తే అందుకు అనుగుణంగా వారు ముందుకు సాగగలరు. నేనైనా.. మహ్మద్‌ షమీ అయినా తిరిగి టీమిండియాలోకి రాగలము’’ అని ఉమేశ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

నా పరిస్థితి వేరు
అదే విధంగా.. ‘‘షమీకి బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నుంచి మంచి మద్దతు ఉంది. దేశీ క్రికెట్‌లో అతడు గొప్పగా రాణిస్తున్నాడు. కానీ నా పరిస్థితి ఇందుకు భిన్నం. విదర్భ అసోసియేషన్‌ నుంచి నాకు మద్దతు లేదు. నిజానికి నేను జట్టుతో చేరినపుడు నాకు ఎవరూ సపోర్టు చేయలేదు.

కోచ్‌ నన్ను వెళ్లగొట్టాలని చూశాడు
ఉమేశ్‌ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించేయాలి అని విదర్భ కోచ్‌ ఆలోచించారు. ‘జట్టులో సీనియర్‌ అంటే ఉమేశ్‌ యాదవ్‌. ఆ ఒక్కడిని తప్పిస్తే అంతా నా చేతుల్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరు నా మాటే వింటారు. అంతటా నా మాటే చెల్లుబాటు అవుతుంది’ అని ఆలోచనలో కోచ్‌ ఉన్నారనిపించింది. అందుకే నేను జట్టు మారిపోయాను’’ అని ఉమేశ్‌ యాదవ్‌ సంచలన ఆరోపణలు చేశాడు.

కాగా 2008లో విదర్భ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉమేశ్‌ యాదవ్‌.. 18 ఏళ్ల పాటు జట్టుతో కొనసాగాడు. ఇక 2024-25 రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టులో అతడు సభ్యుడు. అయితే, 2026-27 సీజన్‌కు ముందే విదర్భను వీడి పంజాబ్‌ జట్టులో చేరాడు.

చదవండి: అభిషేక్‌ శర్మ వరల్డ్‌ రికార్డు బ్రేక్‌ చేసిన పాకిస్తాన్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement