
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆడనున్నాడు. డివిజన్–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో కిషన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాబోయో కౌంటీ సీజన్‌లో కిషన్ నాటింగ్‌హామ్‌షైర్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ స్థానంలో కిషన్‌ను నాటింగ్‌హామ్ తమ జట్టులోకి తీసుకుంది.
ఈ సౌతాఫ్రికా వికెట్ కీపర్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్లనున్నాడు. వెర్రెయిన్ గైర్హజరీలో కిషన్ రెండు వారాల పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. కిషన్ జూన్ 22 నుండి 26 వరకు ట్రెంట్ బ్రిడ్జ్‌లో యార్క్‌షైర్‌తో, జూన్ 29 నుండి జూలై 2 వరకు టౌంటన్‌లో సోమర్‌సెట్‌పై ఆడనున్నాడు.
ఈ విషయాన్ని ఇషాన్ ధ్రువీకరించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో తొలిసారి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని కిషన్ తెలిపాడు. ఇక 10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఈ జార్ఖండ్ ఆటగాడు నిలిచాడు.
కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్‌షైర్, హాంప్‌షైర్‌లతో జతకట్టారు. కాగా ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన కిషన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు.
ఇప్పుడు కౌంటీల్లో మెరుగ్గా రాణిస్తే.. భారత జట్టులోకి తిరిగి పునరాగమనం చేసే అవకాశముంది. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా కిషన్‌కు పిలుపు వచ్చే అవకాశముంది.
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ