
ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులను ఐరిష్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ ఒ'బ్రెయిన్ ఖండించాడు. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే తన మనసు తల్లడిల్లుతోందని.. తన హృదయంలో భారతీయులకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.
కాగా ఇటీవలి కాలంలో ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు పెరిగిపోయాయి. రాజధాని డబ్లిన్‌లో ఓ భారత వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి మరీ చిత్ర హింసలకు గురిచేశారు. మరో ఘటనలో ఆరేళ్ల చిన్నారిపై.. తోటి పిల్లలే దాడికి తెగబడటం సంచలనం రేపింది.
తన ఇంటి బయట ఆడుకుంటున్న నియా నవీన్ అనే ఆరేళ్ల బాలిక ముఖంపై.. 12- 14 ఏళ్ల వయస్సున్న పిల్లలు పిడిగుద్దులు కురిపించారు. ఈ దుర్ఘటనలను ఐర్లాండ్‌లోని భారత రాయబారి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో భారతీయ రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.
నా మనసులో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం
ఈ పరిణామాల నేపథ్యంలో కెవిన్ ఒ బ్రెయిన్ ఐర్లాండ్‌లోని భారతీయులను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ రాశాడు. ‘‘ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, హేయమైన చర్యలు నా మనసుకు బాధ కలిగించాయి.
ఇక్కడి ప్రజలుగా మేమేంటో ఇలాంటి దాడులు ఏ రకంగానూ నిర్వచించలేవు. ఇండియా, ఇండియన్స్‌కు నా మనసులో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఐర్లాండ్ మాలాగే మీ ఇల్లు కూడా అని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను.
ఐరిష్ సమాజ అభివృద్ధిలో మీ వంతు సాయం కూడా ఉంది. మీరు కూడా ఈ దేశంలో భాగమయ్యారు. మీరు చేసే ప్రతి పనిని మేమెంతగానో గౌరవిస్తాం’’ అని కెవిన్ ఒ బ్రెయిన్ ప్రేమపూర్వక నోట్‌తో బాధితులకు సంఘీభావం తెలిపాడు.
ఐర్లాండ్ తరఫున సత్తా చాటి
కాగా 2008 నుంచి 2021 వరకు ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన కెవిన్.. మూడు టెస్టులు, 152 వన్డేలు, 109 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ టెస్టుల్లో 258 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 3619 రన్స్‌తో పాటు 114 వికెట్లు తీశాడు. అదే విధంగా.. అంతర్జాతీయ టీ20లలో 1973 పరుగులు సాధించడంతో పాటు 58 వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.
ఇక తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను కెవిన్ భారత్‌లోనే ఆడటం విశేషం. 2011 వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా ఇంగ్లండ్‌పై 50 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలి ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంటే, 2023 వరల్డ్‌కప్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ విషయంలో ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్‌వెల్ (40 బంతుల్లోనే శతకం) కెవిన్‌ను అధిగమించాడు.
చదవండి: ఒక్క బిస్కట్ కోసం పడిగాపులు.. తోకలు ఊపుతూ..: రితికా సజ్దే భావోద్వేగం