వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్‌.. చిత్తు చిత్తుగా ఓడించి.. | Ireland Beat West Indies By 124 Runs In 1st ODI, Check Out Full Score Details Inside | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్‌.. చిత్తు చిత్తుగా ఓడించి..

May 22 2025 8:20 AM | Updated on May 22 2025 12:07 PM

Ireland Beat West Indies By 124 Runs In 1st ODI Check Scores

వెస్టిండీస్‌కు ఐర్లాండ్‌ క్రికెట్‌ జట్టు భారీ షాకిచ్చింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ (ODI Series)ను ఘనంగా ఆరంభించింది. డబ్లిన్‌ వేదికగా బుధవారం జరిగిన తొలి పోరులో ఐర్లాండ్‌ వెస్టిండీస్‌ను ఏకంగా 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం వెస్టిండీస్‌ ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది.

ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం తొలి వన్డే జరిగింది. ‘ది విలేజ్‌’ మైదానంలో టాస్‌ గెలిచిన విండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌..  నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 303 పరుగులు చేసింది.

ఓపెనర్లలో ఆండీ బాల్‌బిర్నీ (138 బంతుల్లో 112; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు).. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ హ్యారీ టెక్టర్‌ (56; 6 ఫోర్లు) అర్ధశతకాలు బాదారు. ఇక విండీస్‌ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ 34.1 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్‌ చేజ్‌ (55; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మెక్‌కార్తీ 4 వికెట్లు తీశాడు. 

సెంచరీ హీరో బాల్‌బిర్నీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో వన్డే జరగనుంది. కాగా ఓవరాల్‌గా వెస్టిండీస్‌పై ఐర్లాండ్‌కిది నాలుగో విజయం కావడం విశేషం. 

ఇదీ చదవండి: విండీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్‌
లండన్‌: ఇంగ్లండ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. 29న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ మొదలవుతుంది. 

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్చర్‌కు కుడిచేతి బొటనవేలికి గాయమైంది. లీగ్‌ వారం వాయిదా పడగానే స్వదేశానికి చేరుకున్న అతను తిరిగి ఐపీఎల్‌ పునఃప్రారంభమైనప్పటికీ గాయం కారణంగానే భారత్‌కు రాలేకపోయాడు.

గాయపడిన అతని పరిస్థితిని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వైద్య బృందం పర్యవేక్షిస్తోందని, రెండు వారాల తర్వాత మరోసారి గాయం తీవ్రతను సమీక్షిస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే ఆర్చర్‌కు గాయమవడం... జట్టుకు దూరమవడం ఇదేం కొత్త కాదు. సుదీర్ఘకాలంగా అతను మోచేతి గాయంతో సతమతమయ్యాడు. పలుమార్లు సర్జరీలు కూడా జరిగాయి.

తర్వాత వెన్నెముక గాయంతో చాన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అమెరికా, కరీబియన్‌లు ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌తో పునరాగమనం చేశాడు. 

ఈ ఏడాది పాక్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు. అతని స్థానంలో లాంకషైర్‌కు చెందిన లెఫ్టార్మ్‌ సీమర్‌ ల్యూక్‌ వుడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇదివరకే టీ20 జట్టుకు ఎంపికైన వుడ్‌కు ఇప్పుడు వన్డే జట్టులోనూ స్థానం దక్కింది. 2022–23 సీజన్‌లో రెండు వన్డేలాడిన ల్యూక్‌ వుడ్‌ ఒక వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు.  

చదవండి: IPL 2025: ‘ప‍్లే ఆఫ్స్‌’కు ముంబై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement