
నాలుగో బెర్త్ ఖరారు చేసుకున్న హార్దిక్ పాండ్యా బృందం
ఢిల్లీపై 59 పరుగులతో విజయం
రేసు నుంచి క్యాపిటల్స్ నిష్క్రమణ
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
ముంబై: ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు.
2 ఓవర్లలో 48 పరుగులు...
బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్‌ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.
ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు.
ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి.
టపటపా...
ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్‌రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది.
మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్‌రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X లక్నో
వేదిక: అహ్మదాబాద్∙
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో