ఇండోర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు.
మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్.. విల్ యంగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. యంగ్(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్‌దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆఖరిలో బ్రేస్‌వెల్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు. రవీంద్ర జడేజా మరోసారి కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కాగా డారిల్ మిచెల్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.
చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్


