ఐపీఎల్‌పై ఫిక్సింగ్‌ అనుమానాలు.. ఫైనల్‌ మ్యాచ్‌ పోస్టర్‌లో హార్దిక్‌ పాండ్యా | IPL Criticized For Posting Hardik Pandya’s Shadow In Final Poster Before Qualifier 2 Match, Check Out Story For Details | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌పై ఫిక్సింగ్‌ అనుమానాలు.. ఫైనల్‌ మ్యాచ్‌ పోస్టర్‌లో హార్దిక్‌ పాండ్యా

Jun 1 2025 6:12 PM | Updated on Jun 1 2025 7:13 PM

IPL Criticized For Posting Hardik Pandya’s Shadow In Final Poster Before Qualifier 2 Match

Photo Courtesy: BCCI

క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ విడుదల చేసిన ఓ పోస్టర్‌ వివాదాస్పదంగా మారింది. ఇందులో ఇదివరకే ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ ఫోటో ఐపీఎల్‌ ట్రోఫీకి ఓ పక్కన ఉం​డగా.. మరో పక్క ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా నీడను పోలిన ఇమేజ్‌ ఉంది. ఫైనల్ నేపథ్యంలో ఐపీఎల్‌ ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఓ బెర్త్‌ ఆర్సీబీ దక్కించుకుంది. మరో బెర్త్‌ ఎవరిదో అన్న క్వశ్చన్‌ మార్కుతో ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.

వాస్తవానికి రెండో ఫైనల్‌ బెర్త్‌ కోసం ఇవాళ (జూన్‌ 1) పోటీ (క్వాలిఫయర్‌-2) జరుగనుంది. ఈ పోటీలో పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్‌ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతుంది.

అయితే క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ ఫలితం రాకుండానే ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ఫైనల్‌ పోస్టర్‌పై హార్దిక్‌‌ పాండ్యా నీడను పోలిన ఇమేజ్‌ను పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ క్లూ ఇచ్చిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్‌ 2025 ఫిక్స్‌ అయ్యిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ఫైనల్‌ పోస్టర్‌పై హార్దిక్‌ నీడను పోలిన ఇమేజ్‌ పెట్టడంతో పాటు నీలం రంగు గుండె సింబల్‌తో ఏమోజీని పెట్టింది. నీలం రంగు ముంబై ఇండియన్స్‌ జెర్నీని సూచిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఫైనల్లో ఆర్సీబీతో తలపడబోయేది ముంబై ఇండియన్సే అని పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి.

ఐపీఎల్‌ ఉద్దేశపూర్వకంగా చేసిందో ఏమో తెలీదు కానీ, ముంబై ఇండియన్స్‌కు ఫేవర్‌గా ఫైనల్‌ పోస్టర్‌ ఉండటం నెట్టింట దుమారాన్ని రేపుతుంది. ఐపీఎల్‌ ఫిక్స్‌ అయ్యిందంటూ ముంబై ఇండియన్స్‌ వ్యతిరేకులు ప్రచారం మొదలుపెట్టారు. ఐపీఎల్‌ యాజమాన్యం వ్యవహారశైలిపై పంజాబ్‌ కింగ్స్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ముంబై ఇండియన్స్‌కు అనుకూలంగా, మాకు వ్యతిరేకంగా మైండ్‌ గేమ్‌ ఆడుతుందని అంటున్నారు.

ఐపీఎల్‌పై జరుగుతున్న ఫిక్సింగ్‌ ప్రచారంలో నిజానిజాలెంతో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ఒకవేళ మ్యాచ్‌ నిజంగానే ఫిక్స్‌ అయ్యుంటే క్రికెట్‌ అభిమానులు ఈజీగా పట్టేస్తారు. ఇవాళ రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement