
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అద్బుతమైన విజయంతో ముగించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 83 పరుగుల తేడాతో సీఎస్‌కే చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34), ఉర్విల్ పటేల్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
సుదర్శన్ ఒక్కడే..
అనంతరం లక్ష్య చేధనలో సీఎస్‌కే బౌలర్లు చెలరేగడంతో గుజరాత్.. 18.3 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయిసుదర్శన్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 13 పరుగులు చేయగా.. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ తలా మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను దెబ్బతీయగా.. రవీంద్ర జడేజా రెండు, పతిరానా, ఖాలీల్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
కాగా ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ టాప్-2 స్దానం ప్రమాదంలో పడింది. ఆర్సీబీ, పంజాబ్ తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో గెలిస్తే గుజరాత్ మూడో స్ధానానికి పడిపోతుంది.
చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్