నరాలు తెగే ఉత్కంఠ | IPL 2026 Qualification Scenarios: PBKS pray for MI, DC wins; KKR need big win | Sakshi
Sakshi News home page

నరాలు తెగే ఉత్కంఠ

May 24 2026 9:37 AM | Updated on May 24 2026 11:38 AM

IPL 2026 Qualification Scenarios: PBKS pray for MI, DC wins; KKR need big win

ఐపీఎల్‌ 2026 చివరి దశకు చేరే ముందు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్లే ఆఫ్స్‌ మూడు బెర్త్‌లు (ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌) ఖరారైనా, నాలుగో బెర్త్‌ అభిమానులను మునివేళ్లపై నిలబెడుతోంది. నిన్న (మే 23) లక్నోపై పంజాబ్‌ గెలుపుతో ఢిల్లీ రేసు నుంచి నిష్క్రమించగా.. మూడు జట్లు (రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌) పోటీలో నిలబడ్డాయి. ఈ జట్ల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉంది.

మూడు జట్లు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు అర్హమైనవే అయినా అవకాశం ఉంది ఒక్క జట్టుకు మాత్రమే కాబట్టి, రెండు జట్లు పోటీ నుంచి నిష్క్రమించక తప్పదు. ఇవాల్టితో ఆ అదృష్ట జట్టు ఏదో తెలిపోతుంది. ఇవాళ మధ్యాహ్నం ముంబై, రాజస్థాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే ఏ టెన్షన్‌ ఉండదు. ఈ జట్లే చివరి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకొని, ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడుతుంది.

ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడిందా.. రాత్రి కేకేఆర్‌-ఢిల్లీ మ్యాచ్‌ వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ముంబై చేతిలో ఓడితే రాజస్థాన్‌ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు పోటీలో పంజాబ్‌, కేకేఆర్‌ ఉంటాయి. ఢిల్లీపై కేకేఆర్‌ తేడాతో గెలిస్తే నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. పంజాబ్‌, కేకేఆర్‌ జట్లలో ఏ జట్టుకు మెరుగైన రన్‌రేట్‌ ఉంటే, ఆ జట్టే ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో పోటీకి సిద్దమవుతుంది. ఒకవేళ ఢిల్లీ చేతిలో కేకేఆర్‌ ఓడిందా పంజాబ్‌ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మధ్యాహ్నం మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓడాలి. రాత్రి మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచినా భారీ తేడాతో గెలవకపోయినా పంజాబ్‌కే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కుతుంది.

ఒకవేళ కేకేఆర్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కాలంటే ముంబై చేతిలో రాజస్థాన్‌ ఓడాలి. ఢిల్లీపై ఆ జట్టు భారీ తేడాతో గెలవాలి.

రాజస్థాన్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ముంబైపై తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాత్రి మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.

వాస్తవానికి పంజాబ్‌, రాజస్థాన్‌ జట్లు పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఈ రెండు జట్లు మిడ్‌ సీజన్‌ వరకు టాప్‌-2 జట్లుగా చలామణి అయ్యాయి. రాజస్థాన్‌ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి జోరును ప్రదర్శించగా.. పంజాబ్‌ ఏకంగా వారాడిన తొలి 7 మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. 

ఇలాంటి పరిస్థితుల నుంచి రెండు జట్లు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన స్థితికి వచ్చాయి. ఇది ఖచ్చితంగా ఆ జట్ల స్వయంకృతాపరాధమే. 

కేకేఆర్‌ విషయానికొస్తే.. పంజాబ్‌, రాజస్థాన్‌కు భిన్నంగా ఉంది. ఈ జట్టు సీజన్‌ తొలి గెలుపు కోసం ఏకంగా ఏడు మ్యాచ్‌లు నిరీక్షించాల్సి వచ్చింది. కేకేఆర్‌ ఆడిన తొలి 6 మ్యాచ్‌ల్లో ఐదింట ఓడగా.. ఓ మ్యాచ్‌ వర్షం​ కారణంగా ఫలితం తేలలేదు. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకున్న కేకేఆర్‌.. చివరి 7 మ్యాచ్‌ల్లో ఒకే ఒక దాంట్లో ఓడి ప్లే ఆఫ్స్‌ రేసులో నిలబడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement