
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొన్న పంత్ ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఆర్సీబీతో ఇవాళ (మే 27) జరుగుతున్న మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో ఆది నుంచే దూకుడుగా ఆడిన పంత్.. 54 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో పంత్‌కు ఇది రెండో సెంచరీ. సెంచరీ పూర్తి చేసిన అనంతరం పంత్ ఆనందంతో పల్టీ కొట్టాడు. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోలు సోషల్‌మీడియాలో వైరవలవుతున్నాయి.
Coldest IPL hundred celebration 🥶pic.twitter.com/WDHHIvLVv6
— CricTracker (@Cricketracker) May 27, 2025
ఎట్టకేలకు పంత్ తనపై పెట్టిన పెట్టుబడికి (రూ. 27 కోట్లు) న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఈ సీజన్‌లో పంత్ చాలా దారుణమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ పేలవ ప్రదర్శన కారణంగా లక్నో సూపర్ జెయింట్స్ చాలా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించాక ఎట్టకేలకు తమ చివరి మ్యాచ్‌లో పంత్ సెంచరీతో సత్తా చాటాడు.
ఇటీవలికాలంలో పంత్ బ్యాట్ నుంచి జాలువారిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇది. ఐపీఎల్‌లో పంత్ చివరిగా 2018 సీజన్‌లో సెంచరీ చేశాడు. నాడు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నేటికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా చలామణి అవుతుంది. తాజా శతకంతో పంత్ తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నాడు.
ఆర్సీబీతో మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ సాధించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ 14, పూరన్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో తుషార, భువనేశ్వర్ కుమార్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, ఈ సీజన్‌లో లక్నో ప్రయాణం ఇదివరకే ముగిసింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆ జట్టు రెండు మ్యాచ్‌ల ముందే నిష్క్రమించింది. సీజన్ ఆరంభంలో అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టు క్రమంగా నీరసపడిపోయింది. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో ఆర్సీబీతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే ఆరో స్థానానికి చేరుకుంటుంది.
ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నోపై గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫయర్-1 బెర్త్ దక్కించుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. పంజాబ్ ఇదివరకే క్వాలిఫయర్ బెర్త్ సాధించగా.. మరో బెర్త్ కోసం గుజరాత్, ఆర్సీబీ పోటీలో ఉన్నాయి. ముంబై తప్పనిసరిగా ఎలిమనేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.