IPL 2025: ‘షో’ మళ్లీ షురూ... | IPL 2025 to resume on May 17 | Sakshi
Sakshi News home page

IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...

May 17 2025 4:05 AM | Updated on May 17 2025 9:33 AM

IPL 2025 to resume on May 17

నేటి నుంచి ఐపీఎల్‌–2025 పునఃప్రారంభం

సీజన్‌లో మరో 17 మ్యాచ్‌లు 

నేడు బెంగళూరుతో కోల్‌కతా ‘ఢీ’

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

బెంగళూరు: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్‌ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్‌ కౌన్సిల్‌ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతుంది. 

లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్‌ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్‌ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు (క్వాలిఫయర్‌–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్‌–2, ఫైనల్‌) కలిపి మొత్తం ఈ సీజన్‌లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్‌ 3న ఫైనల్‌ జరుగుతుంది.  

ముస్తఫిజుర్, డుప్లెసిస్‌ రెడీ... 
ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్‌ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్‌ డుప్లెసిస్‌ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్‌ మిగిలిన లీగ్‌ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం వెళ్లిపోతాడు.

ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్‌ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్‌ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్‌ డేవిడ్‌లతో ఆర్‌సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్‌ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్‌ విషయంలో పంజాబ్‌ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్‌ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్‌ కమిన్స్‌ మిగిలిన మూడు లీగ్‌ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం!  

గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్‌సీబీ... 
సీజన్‌లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్‌ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్‌ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్‌ చాన్స్‌ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్‌ నిలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement