breaking news
resumption
-
IPL 2025: ‘షో’ మళ్లీ షురూ...
బెంగళూరు: ఐపీఎల్ 18వ సీజన్లో తొమ్మిది రోజుల విరామానంతరం తర్వాతి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా లీగ్‌ను గవరి్నంగ్ కౌన్సిల్ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం నేటి నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభమవుతున్నాయి. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతుంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఈ నెల 7న జరిగింది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసి లీగ్‌కు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆ మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారు. 70 మ్యాచ్‌ల లీగ్ దశలో 57 మ్యాచ్‌లు ముగిశాయి. మిగిలిన 13 మ్యాచ్‌లతో పాటు నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) కలిపి మొత్తం ఈ సీజన్లో మరో 17 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ప్రకటించలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. ముస్తఫిజుర్, డుప్లెసిస్ రెడీ... ఐపీఎల్లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనే విదేశీ ఆటగాళ్ల విషయంలో శుక్రవారం మరింత స్పష్టత వచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌కు మార్గం సులువైంది. ఢిల్లీ తరఫున అతను బరిలోకి దిగుతాడు. ఢిల్లీ టాప్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ తాను మిగిలిన మ్యాచ్‌లకు తిరిగి రావడం ముందే స్పష్టం చేసేశాడు. ఓపెనర్ డుప్లెసిస్ కూడా ఆడేందుకు సిద్ధం కావడం క్యాపిటల్స్‌కు సానుకూలాంశం. స్టబ్స్ మిగిలిన లీగ్ దశలో ఉండి ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం వెళ్లిపోతాడు.ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన హైదరాబాద్, చెన్నై, రాజస్తాన్ జట్లకు విదేశీ క్రికెటర్ల ప్రాతినిధ్యం పెద్దగా సమస్య కాకపోవచ్చు. అయితే ఫలితాన్ని ప్రభావితం చేయగల విదేశీ ఆటగాళ్లు ఉన్న టీమ్‌లకు వారంతా తిరిగి రావడం ప్లే ఆఫ్స్ అవకాశాలకు పెద్ద బలంగా మారింది. సాల్ట్, షెఫర్డ్, టిమ్ డేవిడ్‌లతో ఆర్సీబీ సంతృప్తిగా కనిపిస్తుండగా... హాజల్‌వుడ్ మాత్రం దూరమయ్యాడు. స్టొయినిస్, ఇన్‌గ్లిస్ విషయంలో పంజాబ్ కింగ్స్‌కు ఇంకా పూర్తి సమాచారం లేదు. ముంబై ఇండియన్స్ తరఫున అంతా అందుబాటులో ఉండగా... ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆ్రస్టేలియా కెప్టెన్ కమిన్స్ మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్‌తో చేరడం ఆశ్చర్యకరం! గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు ఆర్సీబీ... సీజన్లో జోరు చూపిస్తూ ఎనిమిది విజయాలు సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో విజయంపై గురి పెట్టింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ సొంతగడ్డపై గెలిస్తే 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. బ్యాటర్లంతా ఫామ్‌లో ఉండటంతో పాటు పదునైన బౌలింగ్‌తో జట్టు బాగా బలంగా కనిపిస్తోంది. బెతెల్, కోహ్లి శుభారంభం అందిస్తుండగా, కెప్టెన్ రజత్ పాటీదార్ వేలి గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగుతున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్, కృనాల్, సుయాశ్‌లతో బౌలింగ్ కూడా బాగుంది. మరోవైపు కోల్‌కతా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న టీమ్ ఖాతాలో 11 పాయింట్లే ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ ఖాయమేమీ కాదు. ఇతర ఎన్నో సమీకరణాలతో ముందంజ వేయడం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ చాన్స్ కోల్పోయిన నాలుగో జట్టుగా కేకేఆర్ నిలుస్తుంది. -
మళ్లీ మానస సరోవర యాత్ర
న్యూఢిల్లీ: భారత్–చైనా సంబంధాల మెరుగుదల దిశగా మరిన్ని కీలక అడుగులు పడ్డాయి. ఈ వేసవి నుంచి కైలాస మానస సరోవర యాత్ర పునఃప్రారంభం కానుంది. ఇరుదేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బీజింగ్ వెళ్లిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి సన్ వెయ్డాంగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు జరిగాయి. ఒప్పందాలు కుదిరాయి. అంతర్జాతీయ నదుల విషయమై పరస్పరం మరింతగా సహకరించుకునేందుకు, జల వనరులకు సంబంధిత డేటాను పూర్తిస్థాయిలో ఇచ్చిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయి. భారత్–చైనా నిపుణుల స్థాయి బృందం దీనిపై వీలైనంత త్వరగా చర్చలు జరపనుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ శాఖ మంత్రి లియూ జియాంచవోలతోనూ మిస్రీ సమావేశ మయ్యారు. పలు కీలకాంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘‘ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఉన్నతస్థాయిలో చర్చలు జరపాలని గత అక్టోబర్‌లో కజాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీలో నిర్ణయించడం తెలిసిందే. తాజా చర్చలు అందులో భాగమే’’ అని వివరించింది. ‘‘ఇరుదేశాల దౌత్య బంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా విశ్వాస కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. ఆర్థిక, వర్తక రంగాల్లో ఇరుదేశాల్లో నెలకొన్న పరస్పర ఆందోళనలు, సందేహాలు కూడా సన్–మిస్రీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. దీర్ఘకాలిక ప్రాతిపదికన విధాన పారదర్శకత, విశ్వసనీయతే గీటురాళ్లుగా ముందుకు సాగాలని అంగీకారం కుదిరింది’’ అని వెల్లడించింది. మానస సరోవర యాత్ర, చైనాకు నేరుగా విమాన సర్వీసులు 2020లో రద్దయ్యాయి. -
అక్కడ విమాన సర్వీసులు వాయిదా?
చెన్నై: తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. విదేశాల నుంచి విమానాల్లో, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించగా 66 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ కేసుల్లో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం తమిళనాడులో ఇప్పటివరకు 14,753 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 98 మరణాలు సంభవించాయి. కోవిడ్-19 బారిన పడిన వారిలో 7,128 మంది కోలుకున్నారు. (కరోనా: కర్ణాటక కీలక నిర్ణయం) -
త్వరలో.. నేషనల్ హెరాల్డ్ పునఃప్రారంభం
న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’, ‘నవజీవన్’ పత్రికలు మళ్లీ పాఠకుల ముందుకు రానున్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఈ పత్రికలను మళ్లీ ప్రచురించనున్నట్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సీ) బుధవారం అధికారికంగా ప్రకటించింది. సీనియర్ జర్నలిస్టు నీలభ్ మిశ్రాను ఎడిటర్ ఇన్ చీఫ్‌గా నియమించారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో పత్రికలను ప్రచురించనున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఈ పత్రికల ప్రచురణను గతంలో నిలిపివేశారు. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్‌ను 1937లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. తాజాగా నీలభ్మిశ్రా సారథ్యంలో ఈ పత్రికలు, డిజిటల్ ఎడిషన్సతో సహా ప్రజల ముందుకు రానున్నాయి. మిశ్రా తన సంపాదక బృందాన్ని నియమించుకుని త్వరలోనే పని ప్రారంభిస్తారని, ఆ తర్వాత ఉర్దూ పత్రిక ఖ్వామీ ఆవాజ్ కూడా వెలువడుతుందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.