
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పటికే పోటీ నుంచి తప్పుకొన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.
ఇక చెన్నై దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నడుమ.. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలను మళ్లీ మైదానంలో కలిపి చూడలేమేమో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
చెన్నైదే పైచేయి
ఏదేమైనా ఆర్సీబీ- చెన్నై పోరు అంటే ఉండే మజానే వేరు. ఇప్పటికి ఐపీఎల్‌లో ఇరుజట్లు 34 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌లలో చెన్నై, 12 మ్యాచ్‌లలో బెంగళూరు జట్లు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ మాత్రం రద్దై పోయింది.
ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై చెన్నైదే పైచేయి కాగా.. ఈ సీజన్లో మాత్రం బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2008 తర్వాత తొలిసారి మళ్లీ చెన్నైని వారి సొంత మైదానం చెపాక్ స్టేడియంలో ఓడించి చరిత్ర తిరగరాసింది.
వర్షం ముప్పు
తాజాగా తమ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. సీఎస్‌కేపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. అయితే, వర్షం ఇందుకు ఆటంకం కలిగించేలా ఉంది. గత రెండు రోజులుగా బెంగళూరులో వాన పడుతోంది.
భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శనివారం కూడా బెంగళూరులో ఆకాశం మేఘావృతమై ఉంది.. సాయంత్రం భారీ వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడేలా ఉంది.
ఇక ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో అందించిన వివరాల ప్రకారం.. చెన్నై శుక్రవారం మూడు గంటలకే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. 45 నిమిషాల్లోపు వర్షం వల్ల ఆటగాళ్లు తిరిగి వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ 4.30 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఆర్సీబీ ఆటగాళ్లు ఐదింటికి అక్కడకు చేరుకోగా.. కాసేటికే మళ్లీ వర్షం పడింది. ఇలా వరుణుడు ఇరుజట్లతో దోబూచులాడుతున్నాడు.
కనీసం రెండు గెలిచినా బెర్తు ఖరారే
ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే ఆర్సీబీ- చెన్నైలకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో ఇప్పటికి పదికి ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ఆర్సీబీకి ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది. ఇంకా మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిచినా బెర్తు ఖరారైపోతుంది.
ఇక ఇప్పటికే పదింట ఏడు ఓడిన పట్టికలో ఆఖర్లో పదో స్థానంలో ఉన్న సీఎస్‌కేకు మ్యాచ్ రద్దైనా పోయేదేమీ లేదు. అయితే, పరువు నిలుపుకోవాలంటే మాత్రం ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎస్‌కే సారథి రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఈ సీజన్‌లో వర్షం వల్ల ఇంత వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వాన వల్ల అర్ధంతరంగా ముగిసిపోయింది.
చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..? ఏ జట్టు ఎన్ని గెలిచింది?