IPL 2025: సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే..? | IPL 2025: How SRH Can Qualify For Playoffs After Defeat Against GT | Sakshi
Sakshi News home page

IPL 2025: సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే..?

May 3 2025 1:47 PM | Updated on May 3 2025 2:57 PM

IPL 2025: How SRH Can Qualify For Playoffs After Defeat Against GT

Photo Courtesy: BCCI

భారీ అంచనాలతో ఐపీఎల్‌-2025 (IPL 2025) బరిలో దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటే.. నామమాత్రపు లక్ష్యాలనూ ఛేదించలేక చతికిలపడింది. ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (రైజర్స్‌- 286)పై దంచికొట్టడం మినహా ఈసారి రైజర్స్‌ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనబడలేదు.

తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ (GT vs SRH)తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ పూర్తిగా విఫలమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది.

ఆకాశమే హద్దుగా చెలరేగి..
ఈ క్రమంలో టైటాన్స్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి.. రైజర్స్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64) ధనాధన్‌ దంచికొట్టారు. ఈ ముగ్గురి అద్భుత ఇన్నింగ్స్‌ నేపథ్యంలో టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.

సన్‌రైజర్స్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరి బౌలింగ్‌ (షమీ 48, పటేల్‌ 41)లో టైటాన్స్‌ 89 పరుగులు పిండుకుంది. మిగతావాళ్లలో కెప్టెన్‌ కమిన్స్‌, జీషన్‌ అన్సారీ ఒక్కో వికెట్‌ తీయగా.. జయదేవ్‌ ఉనాద్కట్‌ మూడు వికెట్ల (3/35)తో రాణించాడు.

అభిషేక్‌ శర్మ ఒక్కడే
ఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 20) మరోసారి విఫలమయ్యాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (17 బంతుల్లో 13) జిడ్డు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ చక్కదిద్దుకునే బాధ్యత తీసుకున్న ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 41 బంతుల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు.

అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (18 బంతుల్లో 23), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ 186 పరుగుల వద్ద నిలిచి.. 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే.. కానీ
ఇక ఇప్పటికి ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి. తద్వారా మూడు విజయాలతో కేవలం ఆరు పాయింట్లలో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.

అయితే, ఇంకా దింపుడు కళ్లెం ఆశలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారీ తేడాలతో విజయాలు సాధించాలి. అదే విధంగా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తేనే ఇది జరుగుతుంది.

ఇతర జట్ల పరిస్థితి ఇలా
ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ (11 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), పంజాబ్‌ కింగ్స్‌ (10 మ్యాచ్‌లు, 6 విజయాలు, 13 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (10 మ్యాచ్‌లు, ఐదు విజయాలు, 10 పాయింట్లు) టాప్‌-5లో ఉన్నాయి.

ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌ (10 మ్యాచ్‌లు, 5 విజయాలు 10 పాయింట్లు), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (10 మ్యాచ్‌లు, 4 విజయాలు,9 పాయింట్లు)లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

రాజస్తాన్‌ రాయల్స్‌ (11 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో ఎనిమిదో స్థానంలో ఉండడగా.. సన్‌రైజర్స్‌ (10 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో రన్‌రేటు పరంగా వెనుకబడి తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌(10 మ్యాచ్‌లు, రెండు విజయాలు, నాలుగు పాయింట్లు)ఆఖర్లో పదో స్థానంలో ఉంది.

ఢిల్లీ, కేకేఆర్‌, ఆర్సీబీ, లక్నోలపై గెలిచి
రాజస్తాన్‌, చెన్నైలను మినహాయిస్తే సాంకేతికంగా మిగిలిన ఎనిమిది జట్లకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్‌ గనుక మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పక భారీ తేడాతో గెలవాలి. ఢిల్లీ, కేకేఆర్‌, ఆర్సీబీ, లక్నోలపై ఘన విజయం సాధిస్తే.. పద్నాలుగు పాయింట్లతో పాటు నెట్‌ రన్‌రేటు (ప్రస్తుతం- -1.192) కూడా మెరుగుపడుతుంది.

అదే విధంగా.. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌, ఆర్సీబీ తమ మిగిలిన మ్యాచ్‌లలో మెజారిటీ శాతం ఓడిపోవాలి. ఇక పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ కూడా రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా తదుపరి మ్యాచ్‌లో ఎక్కువగా ఓడిపోవాలి. 

ఇంతా జరిగినా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ఇంకేదో అద్భుతం జరగాలి. అయితే, తదుపరి ఢిల్లీ (మే 5)తో మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం ఓడిందా.. ఇక అంతే సంగతులు! టోర్నీ నుంచి అవుట్‌.. సోషల్‌ మీడియా మీమర్ల భాషల్లో చెప్పాలంటే చెన్నై, రాజస్తాన్‌లతో పాటు అసోం రైలుకు టికెట్‌ కన్‌ఫామ్‌ చేసుకున్నట్లే!!

చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement