అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!.. ఎందుకిలా చేశాడు? | Is Gill Kicks Abhishek Sharma After Heated Argument With Umpires Viral | Sakshi
Sakshi News home page

Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!.. ఇలా చేయడం సరికాదు

May 3 2025 9:00 AM | Updated on May 3 2025 10:27 AM

Is Gill Kicks Abhishek Sharma After Heated Argument With Umpires Viral

Photo Courtesy: BCCI/JioHotstar

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ప్రవర్తన విమర్శలకు దారితీసింది. సారథిగా సంయమనంతో వ్యవహరించాల్సిన ఆటగాడే ఇలా సహనం కోల్పోవడం సరికాదంటూ క్రికెట్‌ ప్రేమికులు అతడిని విమర్శిస్తున్నారు. గిల్‌ నుంచి ఇలాంటివి అస్సలు ఊహించలేదని.. స్నేహపూర్వకంగా చేసే పనులకు కూడా ఓ హద్దు ఉంటుందని సోషల్‌ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు.

అసలు విషయమేమిటంటే.. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌ అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు (GT vs SRH)తో తలపడింది. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడిన టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

సాయి, గిల్‌ మెరుపు ఇన్నింగ్స్‌
ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48), శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64) కూడా అదరగొట్టాడు. వీరికి తోడు వాషింగ్టన్‌ సుందర్‌ (16 బంతుల్లో 21) కూడా రాణించాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టైటాన్స్‌ ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 224 పరుగులు చేసింది. అయితే, గిల్‌ రనౌట్‌ అయిన తీరు విమర్శలకు దారితీయగా.. అతడు మైదానాన్ని వీడే ముందు అంపైర్‌తో వాదించాడు.

38 పరుగుల తేడాతో 
ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో తడబడ్డ సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 186 పరుగులే చేసింది. తద్వారా 38 పరుగుల తేడాతో ఓటమి పాలై ప్లే ఆఫ్స్‌ ఆశలను దాదాపు వదిలేసుకుంది.

ఇక రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఒక్కడే మెరుగ్గా ఆడాడు. మొత్తంగా 41 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. అయితే, పద్నాలుగో ఓవర్లో టైటాన్స్‌ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ వేసిన యార్కర్‌ను ఆడే క్రమంలో అభిషేక్‌ విఫలమయ్యాడు.

అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!
అయితే, బంతి దిశను మార్చుకుని అతడి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం స్పందించకపోవడంతో.. టైటాన్స్‌ రివ్యూకు వెళ్లింది. అందులో బంతి వికెట్లను హిట్‌ చేసినట్లుగా కనిపించినప్పటికీ.. అంపైర్స్‌ కాల్‌ ద్వారా అభిషేక్‌ నాటౌట్‌గా నిలిచాడు.

దీంతో సహనం కోల్పోయిన శుబ్‌మన్‌ గిల్‌ ఫీల్డ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. కోపంతో అతడి పైపైకి వస్తూ వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇంతలో అభిషేక్‌ శర్మ జోక్యం చేసుకుని గిల్‌ను కూల్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే, అప్పటికి అభిషేక్‌ క్రీజులో ఉండి చాలా సేపు కావడంతో బహుశా కండరాలు పట్టేయడంతో.. ఫిజియోను పిలిపించుకుని ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అభిషేక్‌ కింద కూర్చుని ఉండగా.. గిల్‌ వెనక్కి వచ్చి అతడి కాలిని తన్నాడు. సమయం వృథా చేస్తున్నాడన్న కారణంతో ఇలా చేసి ఉంటాడు.

PC: BCCI/JioHotstar

యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌.. సరదాగా చేసినా..
కాగా గిల్‌- అభిషేక్‌.. ఇద్దరూ దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌ జట్టుకు ఆడతారన్న విషయం తెలిసిందే. ఈ ఓపెనింగ్‌ జోడీ మధ్య గాఢమైన స్నేహం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం అభిషేక్‌ గిల్‌ను సముదాయించేందుకు ప్రయత్నిస్తే.. అతడు మాత్రం ఇలా కాలితో తన్నడం గమనార్హం.

అభిషేక్‌తో తనకున్న చనువుతో సరదాగానే గిల్‌ ఈ పని చేసినా.. లైవ్‌లో ఇలాంటి చర్యలు ఎంతమాత్రం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రైజర్స్‌పై గెలుపుతో ఈ సీజన్‌లో టైటాన్స్‌ ఏడో విజయం నమోదు చేయగా.. కమిన్స్‌ సేనకు ఇది ఏడో ఓటమి.

చదవండి: IPL 2025: శుబ్‌మ‌న్ గిల్‌ది ఔటా? నాటౌటా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement