Shubman Gill: అంపైర్లతో గొడవ.. తప్పేముంది?.. తగ్గేదేలే.. | Shubman Gill Breaks Silence On Argument With Umpires You Are Bound To | Sakshi
Sakshi News home page

Shubman Gill: అంపైర్లతో గొడవ.. తప్పేముంది?.. తగ్గేదేలే..

May 3 2025 12:03 PM | Updated on May 3 2025 12:28 PM

Shubman Gill Breaks Silence On Argument With Umpires You Are Bound To

Photo Courtesy: BCCI/IPL

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరును గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ సమర్థించుకున్నాడు. వందకు నూటా పది శాతం కష్టపడుతున్నపుడు ఇలాంటివి జరుగుతాయని.. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపు చేసుకోలేమని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా టైటాన్స్‌ శుక్రవారం సన్‌రైజర్స్‌తో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 38 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 76 పరుగులు సాధించాడు.

అంపైర్లతో వాదన
తనకు అచ్చొచ్చిన మైదానంలో గిల్‌ శతకం దిశగా పయనిస్తున్న వేళ అనూహ్య రీతిలో రనౌట్‌ అయ్యాడు. జీషన్‌ అన్సారీ బౌలింగ్‌లో జోస్‌ బట్లర్‌ పరుగుకు యత్నించగా.. గిల్‌ రన్‌ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఇంతలో ఫీల్డర్‌ హర్షల్‌ పటేల్‌ విసిరిన బంతిని వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అందుకుని వికెట్లకు గిరాటేశాడు.

అయితే, బంతి క్లాసెన్‌ గ్లోవ్స్‌ను తాకి స్టంప్స్‌ పక్కగా వెళ్లింది. అప్పుడు క్లాసెన్‌ గ్లవ్‌ తాకి స్టంప్స్‌ పైకి ఎగిరినట్లు కనిపించింది. అయితే, కీపర్‌ చేతిలో ఉండగానే బంతి స్టంప్‌ను తాకిందా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. అయినప్పటికీ టీవీ అంపైర్‌ మాత్రం గిల్‌ను అవుట్‌గానే ప్రకటించాడు.

మరోసారి వాగ్వాదం
ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనైన శుబ్‌మన్‌ గిల్‌ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అదే విధంగా.. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ విషయంలో ఎల్బీడబ్ల్యూ అప్పీలు అంశంలో ప్రతికూల నిర్ణయం రావడంతో కోపోద్రిక్తుడయ్యాడు.

మళ్లీ అప్పుడు కూడా గిల్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. ఈ పరిణామాల గురించి విజయానంతరం గిల్‌ స్పందించాడు. ‘‘నాకు, అంపైర్‌కు మధ్య చర్చ జరిగింది. ఒక్కోసారి భావోద్వేగాలను అదుపుచేసుకోలేము.

తప్పేముంది?.. తగ్గేదేలే
గెలిచేందుకు వందకు 110 శాతం కృషి చేస్తున్నపుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగిన విషయం గురించే మాట్లాడాను. ఈ వైఖరి తప్పని నేను అనుకోను’’ అని గిల్‌ స్పష్టం చేశాడు. స్కోరు బోర్డును ఎలా పరుగులు తీయించాలో తమకు తెలుసునని.. ఏదేమైనా ప్లే ఆఫ్స్‌కు చేరువ కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

కాగా ఈ సీజన్‌లో ఇప్పటికి పది మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌కు ఇది ఏడో గెలుపు. తద్వారా పద్నాలుగు పాయిం ట్లతో పట్టికలో రెండోస్థానంలోకి దూసుకు వచ్చింది. మరోవైపు.. ఏడో పరాజయం నమోదు చేసిన సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌  అవకాశాలను దాదాపు కోల్పోయింది. 

ఐపీఎల్‌-2025: టైటాన్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌
👉టాస్‌: సన్‌రైజర్స్‌.. తొలుత బౌలింగ్‌
👉టైటాన్స్‌ స్కోరు: 224/6 (20)
👉సన్‌రైజర్స్‌ స్కోరు: 186/6 (20)
👉ఫలితం: 38 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై టైటాన్స్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ప్రసిద్‌ కృష్ణ (టైటాన్స్‌ పేసర్‌- నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు).

చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement