
Photo Courtesy: BCCI
గత ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్‌ఎస్‌జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.
THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025
అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు.
Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic
— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025
నిన్న (ఏప్రిల్ 22) ఎల్‌ఎస్‌జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్‌లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.
సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్‌లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఎల్‌ఎస్‌జీలో రాహుల్ ప్రస్తానం
లక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్‌లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్‌లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.