
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, పంజాబ్ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకుంటాయి.
లీగ్ దశలో సాధించిన విజయాలు, నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారయ్యాయి. పంజాబ్, ఆర్సీబీ తలో 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో పంజాబ్‌కు తొలి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కింది.
గుజరాత్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్ కూడా పంజాబ్, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్ లభించింది.
ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఎలా..?
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫయర్-2లో (జూన్ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది.
క్వాలిఫయర్-2లో ఇంకో బెర్త్ ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్-1లో గెలిచే జట్టుతో ఫైనల్‌లో (జూన్ 3) తలపడుతుంది.
ఆర్సీబీ, పంజాబ్ క్వాలిఫయర్ మ్యాచ్ రద్దైతే..?
పంజాబ్, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్-1 మ్యాచ్ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్ ఫైనల్‌కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్ ప్రకారం క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు.
కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్‌కు చేరుతుంది. పంజాబ్‌కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్ రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్, ఆర్సీబీ క్వాలిఫయర్-1 మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు.