
న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి డెంటాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని సీఎస్‌కే అధికారికంగా ధ్రువీకరించింది. "ఈ క్లిష్ట సమయంలో కాన్వే కుటుంబానికి మద్దతుగా ఉంటాము. డెంటాన్ మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము" అని సీఎస్‌కే యాజమాన్యం ఎక్స్‌లో రాసుకొచ్చింది.
కాగా కాన్వే తండ్రి మృతికి సంతాపంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాళ్లు నల్లటి బ్యాండ్‌లు ధరించి మైదానంలో దిగారు. కాగా కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. అతడు ఈ ఏడాది ఐపీఎల్‌లో చివరగా ఏప్రిల్ 11న సీఎస్‌కే తరపున ఆడాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన డెంటాన్ కాన్వే కుటంబం.. డెవాన్ కాన్వే చిన్నతనంలో న్యూజిలాండ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలోనే కాన్వే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ప్రదర్శన చేసి కివీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతి తక్కువ కాలంలోనే బ్లాక్‌క్యాప్స్ జట్టులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఐపీఎల్-2025లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన డెవాన్.. 27.03 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు చేశాడు. కాన్వే తిరిగి రావడంపై మాత్రం సీఎస్‌కే ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. చెన్నై జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో కొనసాగుతోంది.