ఐపీఎల్‌-2025 తొలి మ్యాచ్‌ కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!? | IPL 2025 1st Match KKR vs RCB Probable Playing XI of Both Teams | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-2025 తొలి మ్యాచ్‌ కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: తుదిజట్లు ఇవే!?

Mar 22 2025 3:53 PM | Updated on Mar 22 2025 4:14 PM

IPL 2025 1st Match KKR vs RCB Probable Playing XI of Both Teams

కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ (Photo Courtesy: BCCI)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) తాజా సీజన్‌కు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో శనివారం తెరలేవనుంది. ఇందుకు ప్రఖ్యాత  ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక. ఇక ఈసారి ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి.

గతేడాది తమను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ను వదిలేసిన కోల్‌కతా.. ఈసారి వెటరన్‌ ప్లేయర్‌ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. బెంగళూరు ఫ్రాంఛైజీ అనూహ్య రీతిలో రజత్‌ పాటిదార్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇక​ మెగా వేలం-2025 నేపథ్యంలో జట్లలోనూ భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్లు, కొత్త జట్లతో కేకేఆర్‌- ఆర్సీబీ ఏమేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌లో గెలుపొంది సీజన్‌లో శుభారంభం అందుకోవాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

వర్షం ముప్పు లేనట్లే?
మరోవైపు.. వర్షం ఈ మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తుందన్న వార్తల నడుమ.. కోల్‌కతాలో వాన తెరిపినిచ్చిందని, ఎండ కూడా కాస్తోందన్న తాజా సమాచారం సానుకూలాంశంగా పరిణమించింది. మరి క్యాష్‌ రిచ్‌ లీగ్‌-2025 ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ తుదిజట్లు ఎలా ఉండబోతున్నాయో చూద్దామా?

కేకేఆర్‌ మరోసారి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా కొనసాగించనుండగా.. అతడికి జోడీగా సౌతాఫ్రికా స్టార్‌ క్వింటన్‌ డికాక్‌ బరిలోకి దిగడం ఖాయమైనట్లు కనిపిస్తోంది. మూడో స్థానంలో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌, నాలుగో స్థానంలో కెప్టెన్‌ రహానే ఆడనున్నారు.

కోహ్లికి జోడీగా సాల్ట్‌!
వీరితో పాటు రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌లతో కేకేఆర్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగానే ఉంది. మరోవైపు.. ఆర్సీబీ తరఫున సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఫిల్‌ సాల్ట్‌ ఓపెనింగ్‌కు రానున్నాడు. వీరితో పాటు లియామ్‌ లివింగ్‌స్టోన్‌, టిమ్‌ డేవిడ్‌, జితేశ్‌ శర్మ బ్యాటింగ్‌ విభాగంలో కీలకం కానున్నారు.

ఇక బౌలర్ల విషయానికొస్తే.. కేకేఆర్‌కు పేసర్లు హర్షిత్‌ రాణాతో పాటు వైభవ్‌ అరోరా, స్పెన్సర్‌ జాన్సన్‌లు.. స్పిన్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి సేవలు అందించనున్నారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అంగ్‌క్రిష్‌ రఘువన్షీ బరిలోకి దిగే అవకాశం ఉంది.

అదే విధంగా.. ఆర్సీబీ పేస్‌ దళం టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాళ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌లతో పటిష్టంగా కనిపిస్తోంది. ఆర్సీబీ తరఫున స్పిన్నర్‌ సూయశ్‌ శర్మ లేదంటే స్వప్నిల్‌ సింగ్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.

కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ తుదిజట్లు (అంచనా)
కేకేఆర్‌
సునిల్‌ నరైన్‌, క్వింటన్‌ డి కాక్‌(వికెట్‌ కీపర్‌), అజింక్య రహానే (కెప్టెన్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి.
ఇంపాక్ట్‌ ప్లేయర్‌: అంగ్‌క్రిష్‌ రఘువన్షీ.

ఆర్సీబీ
ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డేవిడ్‌, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, యశ్‌ దయాళ్‌. 

చదవండి: ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి ఉండదు: ‘లక్నో’పై నెటిజన్లు ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement