
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ ఇంకొకటి ఉండదంటూ క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుకున్నాం కాబట్టి.. ఆటగాళ్ల భావోద్వేగాలతో ఆడుకోవచ్చనే సంస్కృతికి వీడ్కోలు పలకాలని హితవు పలుకుతున్నారు.
భారీ ధరకు కొనుగోలు
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్ మెగా వేలం-2025లో లక్నో యాజమాన్యం సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (David Miller)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడిన ఈ విధ్వంసకర వీరుడు ఆక్షన్‌లోకి రాగా.. రూ. 7.5 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
ఇక మార్చి 22న ఐపీఎల్ తాజా ఎడిషన్ ఆరంభం కానుండగా.. మార్చి 24న లక్నో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు విశాఖకు చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే.. లక్నో ఫ్రాంఛైజీ డేవిడ్ మిల్లర్‌తో ఓ ఇంటర్వ్యూయర్ జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి.. మీ కెరీర్‌లో బిగ్గర్ హార్ట్‌బ్రేక్ ఏది? అంటూ మిల్లర్‌ను ప్రశ్నించాడు.
బిగ్గర్ హార్ట్‌బ్రేక్ ఏది? నవ్వుతూ ప్రశ్నలు
ఇందులో.. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున 2023 ఫైనల్లో ఓటమి.. 2014లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ ఓటమి.. లేదంటే.. వరల్డ్‌కప్-2019, 2021లలో సౌతాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం.. లేదా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో ఓటమి.. అదీ కాదంటే వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్‌లో ఓటమి.. లేదంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి.. వీటిల్లో మీ హృదయాన్ని ముక్కలు చేసిన సంఘటన ఏది?’’ అంటూ బోలెడన్ని ఆప్షన్లు కూడా ఇచ్చాడు.
అంతేకాదు.. సదరు వ్యక్తి నవ్వుతూ ఈ ప్రశ్నలు అడగటం గమనార్హం. ఇందుకు మిల్లర్ బాధగా, దిగాలుగా ముఖం పెట్టుకుని సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఇంటర్వ్యూయర్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లక్నో.. ‘ఇకపై మిల్లర్‌కు ఇలాంటి బాధలు ఉండవు’ అంటూ తాము ఈసారి టైటిల్ గెలవబోతున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది.
ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు
మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఇది వినోదం కాదు.. ఓ ఆటగాడిని మానసికంగా వేధించడం లాంటిది. ఓటములను గుర్తుచేస్తూ అతడి మనసును మరింత బాధపెట్టడం సరికాదు. వీడియోలు సృజనాత్మకంగా ఉండాలి గానీ.. ఇలా ఆటగాడి మనసును నొప్పించేలా ఉండకూడదు.
డబ్బులు పెట్టి కొన్నారు కాబట్టి ఆటగాళ్లంతా తాము చెప్పినట్లు నడచుకోవాలనే లక్నో యాజమాన్యం అహంభావ వైఖరికి ఇది నిదర్శనం. గత సీజన్లో కేఎల్ రాహుల్‌ను అవమానించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఐపీఎల్‌లో ఇంతకంటే చెత్త ఫ్రాంఛైజీ మరొకటి లేదు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
రాహుల్ పట్ల అదే తీరు
కాగా గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. అప్పటి తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మైదానంలోనే అరిచేశాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు విస్తృతంగా వైరల్ కాగా.. గోయెంకాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్ రాహుల్ లక్నోను వీడి వేలంలోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. మరోవైపు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొన్న లక్నో.. కెప్టెన్‌గా అతడికి పగ్గాలు అప్పగించింది.
చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
Manifesting zero heartbreaks for Miller bhai this season 🤞 pic.twitter.com/4zd5FbtblW
— Lucknow Super Giants (@LucknowIPL) March 20, 2025