
రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా (PC: IPL/BCCI)
ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు అంశాన్ని ఆ జట్టు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అదే విధంగా.. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సైతం పాండ్యాను తమ నాయకుడిగా అంగీకరించేందుకు ఇంకా సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్-2024లో తమ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో పోరు సందర్భంగా ఆటగాళ్ల ప్రవర్తన ఇందుకు ఊతమిచ్చింది.
ముఖ్యంగా హార్దిక్.. రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరు.. అదే విధంగా.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ ఎటాక్‌కు దిగడం వంటివి విమర్శలకు తావిచ్చాయి.
ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై గుజరాత్ చేతిలో ఓడిపోవడంతో.. అటు ముంబై, ఇటు గుజరాత్ ఫ్యాన్స్ నుంచి పాండ్యా ఘాటైన కామెంట్ల ఒకరకంగా తీవ్ర అవమానమే ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజా ఎడిషన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ను మళ్లీ మారుస్తారా అనే చర్చకు ఆస్కారం ఏర్పడింది.
ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఒకప్పటి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్ టామ్ మూడీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఆశ్చర్యం మరొకటి ఉండదు.
ఐదు లేదంటే ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత ఓ ఫ్రాంఛైజీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది తొందరపాటు నిర్ణయమే అవుతుంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తీసుకున్న నిర్ణయం.
హార్దిక్ పాండ్యా విషయానికొస్తే.. నాయకుడి పాత్రలో అతడిని నియమించడం వివాదానికి దారితీసింది. అంతేకాదు.. చాలా మందిని ఈ నిర్ణయం విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరిచింది.
అయినా.. ముందుగా చెప్పినట్లు అది దీర్ఘకాల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. అయితే, ముంబై కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఎందుకో తడబడ్డాడు. గుజరాత్ టైటాన్స్ సారథిగా గత రెండేళ్లుగా తను ఎంతో రిలాక్స్‌డ్‌గా కనిపించాడు. కానీ ఇప్పుడిలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు’’ అని టామ్ మూడీ పేర్కొన్నాడు.
ఇప్పట్లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తొలగించి మళ్లీ అతడి స్థానంలో రోహిత్ శర్మను సారథి చేసే అవకాశం లేదని పరోక్షంగా అభిప్రాయపడ్డాడు. కాగా 2022లో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా తప్పుకొని రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.
అయితే, జడ్డూ విఫలం కావడంతో మధ్యలోనే కెప్టెన్సీ వదిలేసి వెళ్లగా ధోని తిరిగి బాధ్యతలు చేపట్టాడు. 2023లో జట్టును మరోసారి చాంపియన్‌గా నిలిపి..తాజా సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బదలాయించాడు.
A game of ᴇʙʙꜱ & ꜰʟᴏᴡꜱ 🫡@gujarat_titans display quality death bowling to secure a remarkable 6️⃣ run win over #MI 👏@ShubmanGill's captaincy starts off with with a W
— IndianPremierLeague (@IPL) March 24, 2024
Scorecard ▶️https://t.co/oPSjdbb1YT #TATAIPL | #GTvMI pic.twitter.com/jTBxANlAtk