Aus vs SA: వన్డే, టీ20లకు ఆసీస్‌ జట్టు ప్రకటన.. కమిన్స్‌, స్టార్క్‌ లేకుండానే.. | Australia Announce Squads for South Africa Series Head Hazlewood Return | Sakshi
Sakshi News home page

Aus vs SA: వన్డే, టీ20లకు ఆసీస్‌ జట్టు ప్రకటన.. కమిన్స్‌, స్టార్క్‌ లేకుండానే..

Jul 30 2025 11:53 AM | Updated on Jul 30 2025 12:17 PM

Australia Announce Squads for South Africa Series Head Hazlewood Return

సౌతాఫ్రికాతో వన్డే, టీ20 (Aus vs SA)లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఈ వైట్‌బాల్‌ సిరీస్‌లకు దూరంగా ఉండనుండగా.. టీ20 సారథి మిచెల్‌ మార్ష్‌ వన్డే జట్టుకూ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.

తొలిసారి వన్డే జట్టులో
వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న విధ్వంసకర వీరుడు ట్రవిస్‌ హెడ్‌తో పాటు పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ (Josh Hazlewood) ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. ఇక విండీస్‌ టూర్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మిచెల్‌ ఓవెన్‌.. వన్డే జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓవెన్‌ 192కు పైగా స్ట్రైక్‌రేటుతో 125 పరుగులు సాధించాడు. దీంతో సెలక్టర్లు అతడిని వన్డే టీమ్‌కు ఎంపిక చేశారు. స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రిటైర్మెంట్ల నేపథ్యంలో మిడిలార్డర్‌లో ఖాళీ అయిన స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు.

లబుషేన్‌కు అవకాశం
మరోవైపు.. పేసర్‌ లాన్స్‌ మోరిస్‌ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక ఇటీవల టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో ఉద్వాసనకు గురైన మార్నస్‌ లబుషేన్‌ వన్డేల్లో మాత్రం స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. కెప్టెన్‌ కమిన్స్‌, స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌లపై పనిభారం తగ్గించే దృష్ట్యా మేనేజ్‌మెంట్‌ వారిద్దరికి విశ్రాంతినిచ్చింది.

ఇక టీ20 జట్టుకు పద్నాలుగు మంది ఆటగాళ్లనే ఎంపిక చేసిన సెలక్టర్లు జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌, ఆరోన్‌ హార్డీ, కూపర్‌ కన్నోలి, జేవియర్‌ బార్ట్‌లెట్‌లపై వేటు వేసింది. అయితే వీరిలో బార్ట్‌లెట్‌ వన్డే జట్టులో మాత్రం స్థానం దక్కించుకోగలిగాడు. 

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా చివరగా వన్డే మ్యాచ్‌ ఆడింది. టీమిండియా చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇక ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసిన ఆస్ట్రేలియా.. టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20లలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది. ఇక తదుపరి స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

సౌతాఫ్రికాతో టీ20లకు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

సౌతాఫ్రికాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్‌, లాన్స్ మోరిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియా వర్సెస్‌ సౌతాఫ్రికా షెడ్యూల్‌
టీ20 సిరీస్‌
👉తొలి టీ20: ఆగష్టు 10- డార్విన్‌
👉రెండో టీ20: ఆగష్టు 12- డార్విన్‌
👉మూడో టీ20: ఆగష్టు 16- కైర్న్స్‌

వన్డే సిరీస్‌
👉తొలి వన్డే: ఆగష్టు 19- కైర్న్స్‌
👉రెండో వన్డే:ఆగష్టు 22- మెకాయ్‌
👉మూడో వన్డే: ఆగష్టు 24- మెకాయ్‌.

చదవండి: WCL 2025: స్టువర్ట్‌ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్‌ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement