హార్దిక్‌ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్‌ | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్‌

Published Tue, May 21 2024 4:54 PM

Not Hardik Fault Seniors Should Have: Harbhajan Singh On MI Captaincy Row

‘‘ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాళ్లతో కూడిన జట్టు. నేను పదేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాను. ముంబై మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే, ఈసారి వాళ్లు తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వారు కెప్టెన్‌ను మార్చారు. కానీ.. వాళ్లు అనుకున్నట్లుగా ఏదీ జరుగలేదు.

జట్టు ఏకతాటిపై ఉన్నట్లు కనిపించలేదు. ఎవరికి వారే అన్నట్లు విడివిడిగా ఉన్నట్లు అనిపించింది. ముంబై లాంటి జట్టు ఇలా పేలవంగా ఆడటం నన్ను బాధించింది.

కెప్టెన్‌ను మార్చాలనే నిర్ణయం సరైందే అయినా.. అందుకు మరో ఏడాది వేచి చూడాల్సింది. ఇందులో హార్దిక్‌ పాండ్యా తప్పేం లేదు. గుజరాత్‌ టైటాన్స్‌లో ఉన్నపుడు అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది.

నిజానికి.. కెప్టెన్‌ ఎవరైనా.. సీనియర్లంతా కలిసి జట్టును ఒక్కటిగా ఉంచాల్సింది. కెప్టెన్లు వస్తారూ.. పోతారు. జట్టు మాత్రం ఒక్కతాటిపై ఉండాలి కదా!

ఈసారి వాళ్లు జట్టులా ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు’’ అని టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ దారుణ వైఫల్యం పట్ల విచారం వ్యక్తం చేశాడు.

కాగా ఈ సీజన్‌ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దీంతో సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

అదే విధంగా హార్దిక్‌ పాండ్యాకు సైతం స్టేడియంలో, సోషల్‌ మీడియాలో  అభిమానుల ఆగ్రహ జ్వాలల సెగ తగిలింది. అందుకు తగ్గట్లుగానే ముంబై వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడం.. ఆఖరికి ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో ఫ్యాన్స్‌ మరోసారి రెచ్చిపోయారు.

ఇక ఓవరాల్‌గా ఈ ఎడిషన్‌లో ముంబై ఆడిన పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు.

జట్టు రెండు వర్గాలుగా విడిపోవడానికి సీనియర్లే కారణమంటూ పరోక్షంగా రోహిత్‌ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌లను టార్గెట్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్యాకు మద్దతు తెలిపే క్రమంలో భజ్జీ జట్టు వైఫల్యాలకు సీనియర్లను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేశాడు.

చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement