
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా ప్రధాన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ రైటార్మ్ పేసర్ ఓవల్ టెస్టు నుంచి తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు టీమిండియా యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో మాత్రం పోరాడి ఓడింది.
2-1తో ఆధిక్యంలో ఇంగ్లండ్
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లగా.. తమకు అచ్చిరాని మాంచెస్టర్‌లో టీమిండియా మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అనూహ్య రీతిలో పుంజుకుని ఓటమి నుంచి తప్పించుకుంది. ఇక ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగనుంది.
ఈ సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఆఖరి టెస్టులో టీమిండియా తప్పక విజయం సాధించాల్సిందే. ఇంతటి కీలకమైన టెస్టులో ప్రధాన పేసర్ బుమ్రాను ఆడించాలని యాజమాన్యం తొలుత భావించింది. అయితే, అతడి ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకొని.. మున్ముందు ఇబ్బంది రాకుండా ఉండాలంటే విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని బీసీసీఐ వైద్య బృందం సిఫారసు చేసింది.
తుదిజట్టులోకి ఆకాశ్ దీప్
ఈ నేపథ్యంలో ఐదో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడు. అతడి స్థానంలో మరో పేసర్ ఆకాశ్ దీప్ భారత తుదిజట్టులోకి రానున్నాడు. స్వల్ప గాయం కారణంగా ఆకాశ్ మాంచెస్టర్ టెస్టులో ఆడలేదు. అయితే, ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా ఉన్న నేపథ్యంలో ఓవల్ టెస్టు బరిలో దిగనున్నాడు.
కాగా ఆకాశ్ దీప్ ఎడ్జ్‌బాస్టన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఏకంగా పది వికెట్లు కూల్చి ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు టెస్టులే ఆడతాడని బీసీసీఐ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. లీడ్స్‌లో ఆడిన బుమ్రా.. ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు దూరంగా ఉన్నాడు.
అనంతరం లార్డ్స్ టెస్టుతో తిరిగి వచ్చిన అతడు.. మాంచెస్టర్‌లోనూ ఆడాడు. అయితే, ఓవల్‌లోనూ ఆడాలని అనుకున్నా ఫిట్‌నెస్ సమస్యల వల్ల సాధ్యపడటం లేదు. కాగా ఈ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లో కలిపి బుమ్రా 14 వికెట్లు తీశాడు.
చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’