కాంస్య పతకం గెలిచిన భారత షూటర్‌ ఇలావేనిల్‌ | Indian shooter Elavenil won bronze medal | Sakshi
Sakshi News home page

కాంస్య పతకం గెలిచిన భారత షూటర్‌ ఇలావేనిల్‌

Jun 11 2025 12:42 AM | Updated on Jun 11 2025 12:42 AM

Indian shooter Elavenil won bronze medal

అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) మూడో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ కాంస్య పతకంతో ఖాతా తెరిచింది. జర్మనీలోని మ్యూనిక్‌లో మంగళవారం మొదలైన ఈ టోర్నీలో తొలి రోజు భారత్‌కు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇలావేనిల్‌ వలారివన్‌ కాంస్య పతకాన్ని అందించింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల ఇలావేనిల్‌ 231.2 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 

ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌ టోర్నీలలో ఇలావేనిల్‌కిది ఏడో పతకం కావడం విశేషం.వాంగ్‌ జిఫె (చైనా; 252.7 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా... క్వాన్‌ యుంజీ (దక్షిణ కొరియా; 252.6 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫయింగ్‌లో ఇలావేనిల్‌ 635.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. టాప్‌–8లో నిలిచిన వారికి ఫైనల్‌ బెర్త్‌ లభించింది.

మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత షూటర్‌ వరుణ్‌ తోమర్‌ 160.3 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచాడు. భారత ఇతర పిస్టల్‌ షూటర్లు నిశాంత్‌ రావత్‌ 12వ స్థానంలో, అర్జున్‌ సింగ్‌ చీమా 20వ స్థానంలో, ఆదిత్య మాల్రా 30వ స్థానంలో నిలిచారు.   

Advertisement
 
Advertisement
Advertisement