భారత్‌ 13  మంగోలియా 0  | Indian football team beat Mongolia 13-0 in its first Group B match | Sakshi
Sakshi News home page

భారత్‌ 13  మంగోలియా 0 

Jun 24 2025 5:00 AM | Updated on Jun 24 2025 5:00 AM

Indian football team beat Mongolia 13-0 in its first Group B match

ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో టీమిండియా శుభారంభం

రెండు గోల్స్‌తో మెరిసిన సౌమ్య గుగులోత్‌  

చియాంగ్‌ మాయ్‌ (థాయ్‌లాండ్‌): ఆసియా కప్‌–2026 మహిళల ఫుట్‌బాల్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 13–0 గోల్స్‌ తేడాతో మంగోలియా జట్టును చిత్తు చేసింది. భారత్‌ తరఫున ప్యారీ జక్సా ఐదు గోల్స్‌ (29వ, 45వ, 46వ, 52వ, 55వ నిమిషాల్లో)తో అదరగొట్టగా... తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ (20వ, 59వ నిమిషాల్లో), ప్రియదర్శిని సెల్లాదురై (73వ, 86వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చొప్పున చేశారు. సంగీత (8వ నిమిషంలో), రింపా హల్దర్‌ (67వ నిమిషంలో), మాళవిక (71వ నిమిషంలో), గ్రేస్‌ డాంగ్మె (75వ నిమిషంలో) ఒక్కో గోల్‌ సాధించారు. 

గోల్స్‌ పరంగా ఆసియా కప్‌ చరిత్రలోనే భారత జట్టుకిది అతిపెద్ద విజయం కావడం విశేషం. 1997లో, 2005లో గ్వామ్‌ జట్టుపై భారత్‌ 10–0 గోల్స్‌ తేడాతో గెలిచింది. తాజా ఫలితంతో భారత జట్టు తమ రికార్డును మెరుగుపర్చుకుంది. గత సీజన్‌లో ‘భారత ఉత్తమ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి’ అవార్డు గెల్చుకున్న సౌమ్య అందించిన పాస్‌ను లక్ష్యానికి చేర్చి సంగీత భారత్‌ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రింపా క్రాస్‌ పాస్‌ను హెడర్‌ షాట్‌తో సౌమ్య గోల్‌గా మలిచింది. విరామ సమయానికి ముందు ప్యారీ జక్సా రెండు గోల్స్‌ చేయడంతో భారత్‌ తొలి అర్ధభాగం ముగిసేసరికి 4–0 తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో భారత్‌ మరింత దూకుడును పెంచింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 29న తిమోర్‌ లెస్టె జట్టుతో ఆడుతుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్‌ ప్రధాన టోర్నీలో ఆడింది.

Advertisement
 
Advertisement
Advertisement