ఫైనల్లో ఓడిన జ్యోతి, చికిత, ప్రీతిక బృందం
మాడ్రిడ్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నమెంట్‌లో భారత జట్టుకు రజత పతకం దక్కింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తానిపర్తి చికిత (తెలంగాణ), ప్రీతిక (మహారాష్ట్ర)తో కూడిన భారత జట్టు ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంక్ జ్యోతి–చికిత–ప్రీతిక త్రయం 228–232 పాయింట్ల తేడాతో ప్రపంచ 14వ ర్యాంక్ కొలంబియా జట్టు చేతిలో ఓడింది.
కీలక సమయంలో స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో... భారత్ జట్టు రజతానికి పరిమితమైంది. ప్రీతిక ఆరుసార్లు పదేసి పాయింట్లు సాధించి జట్టును నడిపించగా.. జ్యోతి మూడుసార్లు మాత్రమే ‘పర్‌ఫెక్ట్–10’ సాధించింది. సీజన్ ప్రారంభ ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీలో ఈ ముగ్గురితో కూడిన భాతర మహిళల కాంపౌండ్ జట్టు పసిడి పతకం గెలిచింది.
ప్రీతిక డబుల్ ధమాకా...
టీమ్ విభాగంలో రజతం దక్కించుకున్న భారత టీనేజ్ ఆర్చర్ ప్రీతిక... వ్యక్తిగత విభాగంలో సంచలన ప్రదర్శనతో పతకం సాధించింది. ప్రపంచ 11వ ర్యాంకర్‌ను ఓడించి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల ప్రీతికకు వరల్డ్‌కప్‌లో ఇదే తొలి వ్యక్తిగత పతకం. ఆదివారం కాంస్య పతక పోరులో ప్రీతిక 145–142 పాయింట్ల తేడాతో హజల్ బురున్ (టర్కీ)ను చిత్తుచేసింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత జట్టు పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్రీతిక... వ్యక్తిగత విభాగంలో అదే జోరు కొనసాగిస్తూ పోడియంపై నిలిచింది.
కాంపౌండ్ విభాగంలో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరగా... ఇక రికర్వ్ విభాగంలో మరో రెండు పతకాల కోసం ఆదివారం భారత ఆర్చర్లు పోటీపడనున్నారు. భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కృతి శర్మతో కలిసి నేడు బరిలోకి దిగనున్నాడు. రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు చేరలేకపోయిన కృతి... నేడు కాంస్య పతకం కోసం పోటీ పడనుంది.


