170 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. చరిత్ర సృష్టించిన భారత పేసర్‌ | Kranti Gaud becomes the first bowler ever to take five Wicket haul in Tests at Lords in Womens Cricket | Sakshi
Sakshi News home page

170 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. చరిత్ర సృష్టించిన భారత పేసర్‌

Jul 11 2026 8:04 PM | Updated on Jul 11 2026 8:12 PM

Kranti Gaud becomes the first bowler ever to take five Wicket haul in Tests at Lords in Womens Cricket

భారత మహిళల క్రికెట్‌ జట్టు యువ పేసర్ క్రాంతి గౌడ్  చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో అరుదైన ఘనత సాధించింది. ఈ మైదానంలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తూ ప్రతిష్ఠాత్మక లార్డ్స్ ఆనర్స్ బోర్డులో తన పేరు లిఖించుకుంది. 

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో క్రాంతి 17 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 37 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. ఫలితంగా భారత్‌ ఇంగ్లండ్‌ను 170 పరుగులకే కుప్పకూల్చి, 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది.

ఈ ప్రదర్శనతో క్రాంతి మరో ఘనత కూడా సాధించింది. టెస్టు క్రికెట్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారత మహిళా ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.

లార్డ్స్ ఆనర్స్ బోర్డులో పేరు నమోదు కావడం ఏ క్రికెటర్‌కైనా ఓ కల. అలాంటి అరుదైన గౌరవాన్ని తన కెరీర్ ప్రారంభ దశలోనే అందుకున్న క్రాంతి గౌడ్ భారత మహిళల క్రికెట్‌లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. క్రాంతి గౌడ్‌ ధాటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. క్రాంతికి జతగా సయాలి సత్ఘరే (2-40), స్నేహ్‌ రాణా (2-41), దీప్తి శర్మ (1-10) కూడా రాణించారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్‌ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌ (44) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. వీరితో పాటు మయా బౌచియర్‌ (23), మ్యాడీ విల్లియర్స్‌ (10), సోఫీ ఎక్లెస్టోన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (58), దీప్తి శర్మ (57) అర్ద సెంచరీలతో రాణించారు. లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి మహిళల టెస్ట్‌ మ్యాచ్‌ ఇదే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement