నిషేధం ఎత్తివేసినా!.. ఐపీఎల్‌ ఆడే ప్రసక్తే లేదు! | I got a lot on my plate: Harry Brook Closes All Doors For IPL Return | Sakshi
Sakshi News home page

నిషేధం ఎత్తివేసినా!.. ఐపీఎల్‌ ఆడే ప్రసక్తే లేదు!

Jul 11 2026 5:27 PM | Updated on Jul 11 2026 5:49 PM

I got a lot on my plate: Harry Brook Closes All Doors For IPL Return

PC: ECB

ఇంగ్లండ్‌ టీ20 జట్టు కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ జోష్‌లో ఉన్నాడు. స్వదేశంలో అతడి సారథ్యంలో.. ఇంగ్లండ్‌ తొలిసారి టీమిండియాపై టీ20 సిరీస్‌ను 3-0తో గెలిచింది. ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా ఈ విజయంలో బ్రూక్‌ది కీలక పాత్ర.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌- టీమిండియా మధ్య శనివారం నాటి నామమాత్రపు ఐదో టీ20లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని బ్రూక్‌ పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్‌ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గొప్ప అనుభవం.. కానీ ఆడలేను
‘‘ఐపీఎల్‌లో ఆడటం నిజంగా గొప్ప అనుభవం. ఐపీఎల్‌ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అయితే, దురదృష్టవశాత్తూ నేనిప్పుడు అక్కడ ఆడేందుకు సమయం కేటాయించే పరిస్థితిలో లేను.

నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం నేను మూడు ఫార్మాట్లు ఆడుతూ.. రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20)కు కెప్టెన్‌గా ఉంటూ.. ఐపీఎల్‌ కూడా ఆడటం అంటే కష్టమే. ప్రస్తుతం నా షెడ్యూల్‌ కిక్కిరిసి పోయి ఉంది. మహా అయితే ఓ మూడు నెలల విరామం దొరుకుతుంది.

అప్పుడు నేను ఆ సమయాన్ని ఐపీఎల్‌ కోసం పెట్టలేను. కాస్త విరామం తీసుకుని.. ఆ తర్వాత ఫిట్‌నెస్‌, ఆటపై దృష్టి పెడతాను. ఇంగ్లిష్‌ క్రికెట్‌ కోసం నేను చేయగలిగిందంతా చేస్తాను’’ అని స్వదేశీ, జాతీయ క్రికెట్‌ పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని హ్యారీ బ్రూక్‌ వివరించాడు.

నిషేధం ఎత్తివేసినా సరే కుదరదు
కాగా 2023లో హ్యారీ బ్రూక్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున మొత్తంగా 11 మ్యాచ్‌లలో కలిపి 190 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ అతడిని వదిలివేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుక్కుంది.

అయితే, 27 ఏళ్ల హ్యారీ బ్రూక్‌ 2024, 2025 సీజన్లలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే ఫ్రాంఛైజీకి హ్యాండిచ్చాడు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. అతడిపై 2028 వరకు ఐపీఎల్‌ నిర్వాహకులు నిషేధం విధించారు. 

అయితే, బ్రూక్‌ తాజా వ్యాఖ్యలను బట్టి.. ఒకవేళ గడువు తీరి నిషేధం ఎత్తివేసినా సరే తాను ఇప్పట్లో ఐపీఎల్‌ ఆడే ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న బ్రూక్‌.. త్వరలోనే టెస్టు సారథిగానూ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

చదవండి: వెస్టిండీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement