క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియాకప్-2027 టోర్నీకి సంబంధించి కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. వచ్చే ఏడాది ఆసియాకప్ జూన్ 18 నుండి జూలై 4 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా ఈ ఈవెంట్ ఉపయోగపడనుంది.
కాగా ఈ ఖండాంతర టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది. అయితే రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆసియా కప్ వేదిక బంగ్లాదేశ్ నుంచి మారుతుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ మాత్రం బంగ్లాదేశ్ వేదికగా నిర్వహించేందుకు సముఖత చూపినట్లు తెలుస్తోంది. బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి.
అదేవిధంగా ఈ ఏడాది ఆరంభంలో భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గోలేదు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్‌గా మాజీ క్రికెట్ తమీమ్ ఇక్భాల్ ఎంపిక కావడంతో.. బీసీసీఐతో కూడా సంబంధాలు మెరుగుపడ్డాయి.
దీంతో ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లా మధ్య వైట్‌బాల్ సిరీస్‌లు కూడా జరిగే అవకాశముంది. ఇక రొటేషన్ పాలసీ ప్రకారం.. ప్రస్తుతం ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడిగా ఉన్న మోహసిన్ నఖ్వీ పదవీ కాలం 2027 ఏప్రిల్‌తో ముగియనుంది.
ఆ తర్వాత కొత్త అధ్యక్షుడిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తరపున ఎవరో ఒకరు ఎంపికయ్యే అవకాశముంది. కాబట్టి ఆసియాకప్ దాదాపుగా బంగ్లా వేదికగా జరగనుంది. కాగా ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.


