తొలి వన్డే భారత మహిళలదే
మెరిసిన యువ బ్యాటర్లు
6 వికెట్లతో ఐర్లాండ్ ఓటమి
రేపు రెండో వన్డే
రాజ్‌కోట్: భారత మహిళల క్రికెట్ జట్టులో ఇటీవలే కొత్తగా వచ్చిన ఇద్దరు యువ బ్యాటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సత్తా చాటారు. వన్డే కెరీర్‌లో కేవలం నాలుగో మ్యాచ్ ఆడుతున్న ప్రతీక రావల్, తేజస్ హసబ్నిస్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఆటకు సీనియర్ స్మృతి మంధాన తోడవటంతో ఐర్లాండ్ మహిళలతో జరిగిన తొలి వన్డే భారత్ ఖాతాలో చేరింది.
జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేయగా... భారత్ 34.3 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా, రెండో వన్డే ఆదివారం జరుగుతుంది.
రాణించిన గాబీ, లియా...
భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక ఐర్లాండ్ ఇబ్బంది పడింది. 29 పరుగుల వ్యవధిలో జట్టు తొలి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ గాబీ లూయిస్ (129 బంతుల్లో 92; 15 ఫోర్లు), లియా పాల్ (73 బంతుల్లో 59; 7 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు.
25 ఓవర్ల పాటు పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన ఈ జోడీ ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించింది. ఈ క్రమంలో గాబీ 75 బంతుల్లో, లియా 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కండరాల నొప్పితో బాధపడుతూ ఆడిన గాబీ త్రుటిలో తన తొలి సెంచరీని చేజార్చుకుంది. భారత్ పేలవ ఫీల్డింగ్ కూడా ఐర్లాండ్‌కు కలిసొచ్చిoది.
మన ఫీల్డర్లు నాలుగు సునాయాస క్యాచ్‌లు వదిలేశారు. ఇందులో ఒకటి గాబీ క్యాచ్, మరో రెండు లియా క్యాచ్‌లు కాగా...చివర్లో ఎర్లీన్ కెల్లీ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) క్యాచ్ కూడా వదిలేయడంతో ఐర్లాండ్ 50 ఓవర్లు ఆడగలిగింది.
భారీ భాగస్వామ్యం...
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రతీక రావల్ (96 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్), కెపె్టన్ స్మృతి మంధాన (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) కలిసి వేగంగా ఛేదనను ప్రారంభించారు. వీరిద్దరు 10.1 ఓవర్లలోనే 70 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 20; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (6 బంతుల్లో 9; 2 ఫోర్లు) వెనుదిరిగారు.
ఇలాంటి స్థితిలో ప్రతీకకు తేజల్ (46 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు) జత కలిసింది. వీరిద్దరు దూకుడుగా ఆడుతూ జట్టును వేగంగా గెలుపు దిశగా తీసుకుపోయారు. 70 బంతుల్లో ప్రతీక, 43 బంతుల్లో తేజల్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. భారత్ విజయం కోసం మరో 21 పరుగులు కావాల్సి ఉండగా, ప్రతీక 75 పరుగుల వద్ద ఉంది.
ఈ దశలో మాగ్వైర్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 89కి చేరిన ఆమె మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగింది. తేజల్‌తో కలిసి రిచా ఘోష్ (8 నాటౌట్) ఆట ముగించింది. ఈ మ్యాచ్‌తో సయాలీ సత్‌ఘరే భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 152వ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.
స్కోరు వివరాలు
ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా ఫోర్బ్స్ (సి) దీప్తి (బి) సాధు 9; గాబీ లూయిస్ (సి అండ్ బి) దీప్తి 92; యునా రేమండ్ (రనౌట్) 5; ప్రెండర్‌గాస్ట్ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ప్రియ 9; డెలానీ (బి) ప్రియా మిశ్రా 0; లియా పాల్ (రనౌట్) 59; క్రిస్టినా కూల్టర్ (నాటౌట్) 15; ఎర్లీన్ కెల్లీ (ఎల్బీ) (బి) సయాలీ 28; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–27, 2–34, 3–56, 4–56, 5–173, 6–194, 7–230. బౌలింగ్: టిటాస్ సాధు 9–1–48–1, సయాలీ సత్‌ఘరే 10–2–43–1, సైమా ఠాకూర్ 10–0–30–0, ప్రియా మిశ్రా 9–1–56–2, దీప్తి శర్మ 10–1–41–1, ప్రతీక రావల్ 2–0–14–0.
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) సార్జంట్ 41; ప్రతీక రావల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 89; హర్లీన్ డియోల్ (సి) ప్రెండర్‌గాస్ట్ (బి) మాగ్వైర్ 20; జెమీమా (స్టంప్డ్) కూల్టర్ (బి) మాగ్వైర్ 9; తేజల్ (నాటౌట్) 53; రిచా ఘోష్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (34.3 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–70, 2–101, 3–116, 4–232. బౌలింగ్: ఒర్లా ప్రెండర్‌గాస్ట్ 4.4–0–28–0, జార్జినా డెంప్సీ 5.3–0– 50–0, ఎర్లీన్ కెల్లీ 6–0–29–0, ఫ్రేయా సార్జంట్ 8–0–38–1, ఎయిమీ మాగ్వైర్ 8–1–57–3, లౌరా డెలానీ 2.2–0–36–0.
Comments
Please login to add a commentAdd a comment