బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పట్టు సాధించింది. 34 పరుగుల కీలక ఆధిక్యం సాధించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 112 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అభిమన్యు ఈశ్వరన్ 0, సాయి సుదర్శన్ 23, దేవ్‌దత్ పడిక్కల్ 24 పరుగులు చేసి ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ బాధ్యతగా ఆడుతూ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి జతగా నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు.
అంతకుముందు భారత పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ (3), సిరాజ్, ఆకాశ్‌దీప్ తలో 2 వికెట్లతో చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 47.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే కూడా తలో వికెట్ తీశారు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అకెర్‌మన్ విధ్వంసకర శతకంతో ఒంటిపోరాటం చేశాడు. సహచరులు సహకరించకపోయినా ఒక్కడే నిలబడి 200 పరుగుల మార్కును దాటించాడు. కేవలం 118 బంతుల్లోనే 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు.
అకెర్‌మన్ కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్డన్ హెర్మన్ (26), సుబ్రాయన్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో సీనియన్ టీమ్ కెప్టెన్ టెంబా బవుమా సహా నలుగురు డకౌట్లయ్యారు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ధృవ్ జురెల్ (132) వీరోచిత శతకంతో టీమిండియా పరువు కాపాడాడు. 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జురెల్.. టెయిలెండర్లు కుల్దీప్ (20), సిరాజ్ (15) సహకారంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
భారత ఇన్నింగ్స్‌లో సీనియర్లు కేఎల్ రాహుల్ (19), సాయి సుదర్శన్ (17), అభిమన్యు ఈశ్వరన్ (0), దేవదత్ పడిక్కల్ (5), రిషబ్ పంత్ (24) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 34 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే అభిమన్యు ఈశ్వరన్ వికెట్ కోల్పోయింది. ఈశ్వరన్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్ (4), సాయి సుదర్శన్ క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్-ఏ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరుగుతుంది.
చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’


