జోరు కొనసాగించాలని...  | India vs Pakistan Hockey Clash On 23 june 2026 | Sakshi
Sakshi News home page

జోరు కొనసాగించాలని... 

Jun 23 2026 6:08 AM | Updated on Jun 23 2026 6:09 AM

India vs Pakistan Hockey Clash On 23 june 2026

నేడు పాకిస్తాన్‌తో భారత హాకీ జట్టు పోరు  

లండన్‌: ప్రపంచ చాంపియన్‌ జర్మనీ జట్టును... ఒలింపిక్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది. ప్రొ లీగ్‌ 2025–2026 సీజన్‌లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తోనూ భారత్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్‌ జరగనుండగా... రెండో మ్యాచ్‌ను శుక్రవారం నిర్వహిస్తారు. 

2024లో చైనా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో చివరిసారి భారత్, పాక్‌ ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. ప్రస్తుత యూరోప్‌ అంచె ప్రొ లీగ్‌లో భారత్‌ తమకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న జట్లను ఓడించి జోరు మీదుంది. జుగ్‌రాజ్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, శిలానంద్‌ లాక్రా, అభిషేక్‌ తమకు లభించిన అవకాశాలను గోల్స్‌గా మలుస్తున్నారు. 

మరోవైపు పాకిస్తాన్‌ జట్టు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ హాకీలో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. గత పదేళ్లలో ఈ రెండు జట్ల మధ్య 17 మ్యాచ్‌లు జరగ్గా... 15 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రొ లీగ్‌లోనూ పాక్‌పై తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. 

తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత ప్రొ లీగ్‌ సీజన్‌లో భారత్‌ 10 పాయింట్లతో 8వ స్థానంలో... పాకిస్తాన్‌ జట్టు పాయింట్ల ఖాతా తెరవకుండానే చివరిదైన 9వ స్థానంలో ఉన్నాయి. ప్రొ లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు 16 మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. ఇప్పటికి అన్ని జట్లు 12 మ్యాచ్‌ల చొప్పున పూర్తి చేసుకున్నాయి. ఈనెల 28తో సీజన్‌ ముగియనుండగా... 34 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement