చెలరేగిన టీమిండియా బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఇంగ్లండ్‌ | India Under 19 Team Restricted England To 174 Runs In 1st Youth ODI | Sakshi
Sakshi News home page

చెలరేగిన టీమిండియా బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఇంగ్లండ్‌

Jun 27 2025 6:58 PM | Updated on Jun 27 2025 7:46 PM

India Under 19 Team Restricted England To 174 Runs In 1st Youth ODI

5 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌ల కోసం భారత అండర్‌-19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (జూన్‌ 27) జరుగుతున్న తొలి యూత్‌ వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ను 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూల్చారు. 

యంగ్‌ ఇండియా బౌలర్లలో కనిష్క్‌ చౌహాన్‌ (10-1-20-3), మొహమ్మద్‌ ఎనాన్‌ (10-1-37-2) తమ స్పిన్‌ మాయాజాలంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టగా.. పేసర్లు ఆర్‌ఎస్‌ అంబరీష్‌, హెనిన్‌ పటేల్‌ తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు. 

మరో పేసర్‌ యుద్దజిత్‌ గుహా (7-0-46-0) కూడా బాగానే బౌలింగ్‌ చేసినా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ బౌలింగ్‌తో ఓ ఓవర్‌ వేసి రెండు పరుగులిచ్చాడు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో రాకీ ఫ్లింటాఫ్‌ (ఆండ్రూ ఫ్లింటాఫ్‌ కొడుకు) అర్ద సెంచరీతో (90 బంతుల్లో 56; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించగా.. ఇస్సాక్‌ మొహమ్మద్‌ (28 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. 

మిగతా బ్యాటర్లలో బెన్‌ డాకిన్స్‌ (18), బెన్‌ మేయర్స్‌ (16), జేమ్స్‌ మింటో (10) రెండంకెల స్కోర్లు చేయగా.. కెప్టెన్‌ థామస్‌ ర్యూ (5), జోసఫ్‌ మూర్స్‌ (9), రాల్ఫీ ఆల్బర్ట్‌ (5), జాక్‌ హోమ్‌ (5), తజీమ్‌ చౌద్రీ అలీ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. 

ఈ టూర్‌లో యంగ్‌ ఇండియాకు ఐపీఎల్‌ హీరో ఆయుశ్‌ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. మాత్రే, చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీతో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడు. మాత్రే, సూర్యవంశీ బ్యాటింగ్‌ చూసేందుకు భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement