టీమిండియా షెడ్యూల్‌లో మరో విదేశీ పర్యటన | India Sri Lanka Test tour set to begin in Galle on August 15 | Sakshi
Sakshi News home page

టీమిండియా షెడ్యూల్‌లో మరో విదేశీ పర్యటన

Jun 10 2026 5:27 PM | Updated on Jun 10 2026 5:30 PM

India Sri Lanka Test tour set to begin in Galle on August 15

భారత టెస్ట్‌ జట్టు షెడ్యూల్‌లో మరో విదేశీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డపై (టెస్ట్‌ సిరీస్‌ కోసం) అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో జరగనుంది.

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీలంకలోని ప్రముఖ వేదిక అయిన గాలే అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, అది కొలంబోలోని సింహలీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ గ్రౌండ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌ చివరిగా లంక గడ్డపై ఆడిన టెస్ట్‌ సిరీస్‌ను విరాట్‌ కోహ్లి నేతృత్వంలో 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ భారత్ అక్కడ టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టూర్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

టెస్ట్ సిరీస్‌తో పాటు లంక టూర్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సిరీస్‌ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెస్ట్‌ సిరీస్‌ షెడ్యూల్‌పై కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. పైన అనుకున్న షెడ్యూల్‌ ఖరారైనట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement