సుదీర్ఘ సమయం ప్రాక్టీస్‌లో భారత్
సుదర్శన్‌పై ప్రత్యేక దృష్టి
కోల్‌కతా: ఎజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్, సైమన్ హార్మర్...గత ఏడాది కాలంలో భారత జట్టును తమ బౌలింగ్‌తో చావుదెబ్బ తీసిన విదేశీ స్పిన్నర్లు. వ్యక్తిగతంగా చూస్తే ఎవరూ చెప్పుకోగ్గ స్టార్లు కాదు. కానీ మన పిచ్‌లపై మన బ్యాటర్లను కుప్పకూల్చి పైచేయి సాధించడంలో వీరు సఫలమయ్యారు. కివీస్, దక్షిణాఫ్రికాల చేతుల్లో ఓడిన నాలుగు టెస్టుల్లో ఈ ముగ్గురు స్పిన్నర్లు కలిపి కేవలం 15.69 సగటుతో 36 వికెట్లు పడగొట్టారు!
కొన్నేళ్ల క్రితం అనామకుడైన ఆ్రస్టేలియా స్పిన్నర్ స్టీవ్ ఒ కీఫ్ కూడా ఒకే టెస్టులో 14 వికెట్లతో మన పని పట్టాడు. భారత్‌కు కలిసి రావాల్సిన స్పిన్ కాస్తా ప్రత్యర్థి బౌలర్లకు వరంగా మారింది. అయితే ప్రత్యర్థి బలంకంటే స్పిన్‌ను సమర్థంగా ఆడలేని మన బలహీనత కోల్‌కతా టెస్టు ఫలితంతో బయటపడింది. నాటి దిగ్గజాలతో పోలిస్తే ప్రస్తుత తరం బ్యాటర్లు గిర్రున తిరిగే బంతులను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు.
గువహటిలో జరిగే రెండో టెస్టుకు ముందు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలో నాటి తరం బ్యాటర్లు ఉపయోగించిన ‘ప్యాడ్ ఆఫ్’ పద్ధతిని అతను అనుసరించాడు. మంగళవారం జరిగిన భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్‌లో ఇది కనిపించింది. దీని ప్రకారం ఒకటే కాలికి ప్యాడ్ కట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తారు.
సాధారణంగా ఆటగాళ్లు డిఫెన్స్ ఆడే క్రమంలో అప్రయత్నంగా తమ కాలును ముందుకు తీసుకొస్తారు. అది చివరకు ఎల్బీడబ్ల్యూకు దారి తీస్తుంది. తాజా ప్రయోగంలో బ్యాటర్లు బంతులను ఎదుర్కొనే క్రమంలో ప్యాడ్‌కంటే కూడా బ్యాట్‌ను ఎక్కువగా ఉపయోగించేందుకు అలవాటు పడతారు. స్పిన్ బౌలింగ్ అయినా సరే, ప్యాడ్ లేకుండా ముందుకు జరిపి ఆడితే మోకాలి కింది భాగంలో గాయమయ్యే అవకాశం ఉంటుంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని అదనపు జాగ్రత్తలతో ఆడాల్సి ఉంటుంది. కోచ్ గంభీర్ ఈ తరహా ప్రాక్టీస్‌ను స్వయంగా పర్యవేక్షించాడు. దాదాపు మూడు గంటలకు పైగా భారత జట్టు ప్రాక్టీస్ సాగింది. రెండో టెస్టు వేదిక గువహటికి వెళ్లకుండా ఈడెన్ గార్డెన్‌లోనే సాధనను కొనసాగించేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపించింది.
రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్‌తో పాటు గిల్ ఆడలేకపోతే మూడో స్థానం కోసం పోటీ పడుతున్న సాయి సుదర్శన్ కూడా సుదీర్ఘ సమయం పాటు తమ బ్యాటింగ్‌కు పదును పెట్టారు. ముఖ్యంగా సుదర్శన్‌కు గంభీర్ ప్రత్యేక సూచనలు ఇవ్వాల్సి వచ్చింది. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్న అతను పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. మరో వైపు జురేల్ ఎక్కువగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయతి్నంచాడు. ఆప్షనల్ కావడంతో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే సాధనకు వచ్చారు.
వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్ కూడా ప్రాక్టీస్ చేశారు. జట్టులో అత్యంత సీనియర్ అయిన జడేజా బ్యాటింగ్ తీవ్రత చూస్తే రెండో టెస్టులో చెలరేగాలనే కసితో ఉన్నట్లు కనిపించాడు. దీంతో పాటు మరో ప్రత్యేకత కూడా టీమిండియా ప్రాక్టీస్‌లో కనిపించింది. రెండు చేతులనూ సమర్థంగా బౌలింగ్‌కు వాడగల ‘సవ్యసాచి’ బెంగాల్ స్పిన్నర్ కౌశిక్ మెయిటీ బ్యాటర్లకు నెట్స్‌లో సహకరించాడు.
కుడి చేత్తో ఆఫ్‌స్పిన్, ఎడమ చేత్తో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల కౌశిక్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ కోసం పిలిపించారు. గతంలో పలు ఐపీఎల్ టీమ్‌లకు బౌలింగ్ చేసిన కౌశిక్ భారత జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి.
జట్టుతో చేరిన నితీశ్ రెడ్డి...
గిల్ రెండో టెస్టుకు దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. దాంతో ముందు జాగ్రత్తగా మరో అదనపు ఆటగాడిని బీసీసీఐ జట్టుతో చేర్చింది. రాజ్‌కోట్‌లో భారత్ ‘ఎ’ తరఫున వన్డే సిరీస్ ఆడుతున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని మేనేజ్‌మెంట్ పిలిపించింది.
సోమవారం సాయంత్రం కోల్‌కతా చేరుకున్న నితీశ్ జట్టుతో కలిసి గువహటికి వెళ్లనున్నాడు. నేడు జరిగే మూడో వన్డే ఆడితే నితీశ్ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సరైన సమయంలో చేరడం కష్టమయ్యేది. అలాంటి సమస్య రాకుండా ముందే అతడిని జట్టుతో కలిసేలా ఏర్పాట్లు చేశారు.


