
నేటి నుంచి ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్ ‘ఎ’ అనధికారిక టెస్టు
నితీశ్ రెడ్డి, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్‌పై దృష్టి
కాంటర్బరీ (ఇంగ్లండ్): టీమిండియా యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి సహా పలువురు ప్లేయర్లు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహక మ్యాచ్ బరిలోకి దిగనున్నారు. వచ్చే నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుండగా... దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత ‘ఎ’ జట్టు శుక్రవారం నుంచి నాలుగు రోజుల మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది.
ఇందులో భారత్ ‘ఎ’ జట్టు తరఫున అభిమన్యు ఈశ్వరణ్, ధ్రువ్ జురేల్, కరుణ్ నాయర్, ఆకాశ్ దీప్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, తనుశ్ కొటియాన్, ముకేశ్ కుమార్, హర్షిత్ రాణా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే బరిలోకి దిగనున్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ఈ సన్నాహక మ్యాచ్‌లు సహకరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో భాగం కాని... భారత టెస్టు జట్టు ఆటగాళ్లను బీసీసీఐ ముందే ఇంగ్లండ్ పంపింది.
కరుణ్ నాయర్ మినహా... మిగిలిన ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఇంగ్లండ్ పర్యటన. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్న అనంతరం టీమిండియా ఆడనున్న తొలి టెస్టు సిరీస్ ఇదే కానుండటంతో... వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు ఈ మ్యాచ్ తోడ్పడనుంది. ప్రధాన సిరీస్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను నిర్ణయించేందుకు కూడా ఈ సన్నాహక మ్యాచ్‌లు సహాయపడనున్నాయి. అభిమన్యు ఈశ్వరణ్, కరుణ్ నాయర్, ఆంధ్రప్రదేశ్ పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ప్రదర్శనపై అందరి దృష్టి నిలవనుంది.
ఆ్రస్టేలియా పర్యటనలో 298 పరుగులతో ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి... ఐపీఎల్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోగా... ఇంగ్లండ్‌తో తుది జట్టులో చోటు దక్కాలంటే ఈ మ్యాచ్‌లో సత్తాచాటాల్సిన అవసరముంది. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దుల్ ఠాకూర్ నుంచి అతడికి పోటీ ఎదురు కానుంది. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో... కొత్త స్పిన్నర్‌గా ఎవరు వెలుగులోకి వస్తారో చూడాలి.