PC: BCCI/X
ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత్, పాకిస్తాన్ టి20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను అత్యధిక మంది వీక్షించారని నిర్వాహకులు తెలిపారు. ఇరు దేశాల పురుషుల హాకీ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌కూ రికార్డు స్థాయి వీక్షణలు నమోదయ్యాయి. ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే భారత్, పాకిస్తాన్ టి20 ఫైనల్ మ్యాచ్‌ను అత్యధిక మంది వీక్షించినట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) వెల్లడించింది.
‘ఈసారి ఆసియా క్రీడలకు మునుపెన్నడూ లేనంత అత్యధిక వీక్షణలు లభించాయి. దీనికి ప్రధాన కారణంగా ఆ రెండు పెద్ద మ్యాచ్‌లే. శనివారం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 ఫైనల్ అత్యధిక వీక్షకులను ఆకర్షించగా... అంతకుముందు భారత్, పాకిస్తాన్ పురుషుల హాకీ సెమీఫైనల్‌ను కూడా చాలా మంది చూశారు’ అని ఓసీఏ కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రామ్ తెలిపారు.
టీమిండియా ఘన విజయం
కాగా నగోయా వేదికగా జరిగి ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాథక్షభారత్ విజయం సాధించింది. తద్వారా టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61), తిలక్ వర్మ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో పాకిస్తాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమైంది. హసన్ నవాజ్ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) ఒక్కడే వీరోచిత పోరాటం చేశాడు. అతడికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో పాక్ ఓటమి పాలైంది.


