
4 x 400 మీటర్ల మిక్స్‌డ్ రిలే టీమ్‌లో పసిడి కైవసం
రూపాల్, సంతోష్, విశాల్, సుభ బృందానికి అగ్ర స్థానం
ప్రవీణ్, తేజస్విన్, పూజ, రూపాల్‌కు వ్యక్తిగత రజతాలు
కాంస్య పతకం నెగ్గిన యూనుస్ షా
అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ హవా
గుమి (దక్షిణ కొరియా) : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత జోరు కొనసాగుతోంది. తొలి రోజు రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు... రెండో రోజు పోటీల్లో ఒక స్వర్ణం సహా మొత్తం ఆరు పతకాలు కైవసం చేసుకున్నారు. 4్ఠ400 మీటర్ల మిక్స్‌డ్ రిలే టీమ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పసిడి పతకం నిలబెట్టుకోగా... డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్, పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకాలతో మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌదరి, మహిళల 1500 మీటర్ల పరుగులో పూజ కూడా రజత పతకాలు సాధించగా... పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ షా కాంస్యం గెలుచుకున్నాడు.
దీంతో భారత ఖాతాలో మొత్తంగా 8 పతకాలు (2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) చేరాయి. 26వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన 4్ఠ400 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రూపాల్ చౌదరి, సంతోష్ కుమార్, విశాల్, సుభ వెంకటేశన్‌తో కూడిన భారత బృందం 3 నిమిషాల 18.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్ర స్థానంలో నిలిచింది. 2023లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలైన సుభ ఈసారి కూడా సత్తా చాటింది.
చైనా (3 నిమిషాల 20.52 సెకన్లు), శ్రీలంక (3 నిమిషాల, 21.95 సెకన్లు) బృందాలు వరసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచినా... అనర్హత వేటుకు గురయ్యాయి. దీంతో ఆ తర్వాత నిలిచిన కజకిస్తాన్ (3 నిమిషాల 22.70 సెకన్లు), కొరియా (3 నిమిషాల 22.87 సెకన్లు) జట్లకు రజత, కాంస్యాలు దక్కాయి. పోటీల తొలి రోజు పురుషుల 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ గుల్విర్ సింగ్ స్వర్ణం గెలుచుకోగా.. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సెబాస్టియన్ కాంస్యం గెలుచుకున్నాడు.
రూపాల్ డబుల్ ధమాకా...
మిక్స్‌డ్ టీమ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన రూపాల్ మహిళల 400 మీటర్ల ఈవెంట్‌లో రజతం కూడా గెలుచుకొని డబుల్ ధమాకా మోగించింది. మహిళల ఈవెంట్‌లో రూపాల్ 52.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన విద్య రామ్‌రాజ్ 53.00 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ననాకో మసుమొటో (52.17 సెకన్లు; జపాన్)కు స్వర్ణం, జానిబిబి హుకుమోవా (52.79 సెకన్లు; ఉజ్బెకిస్తాన్)కు కాంస్యం గెలుచుకుంది.
2022 ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు (4్ఠ400 మీటర్ల రిలే, 400 మీటర్ల పరుగు) సాధించిన రూపాల్ ఈ టోర్నీలోనూ రెండు పతకాలు నెగ్గడం విశేషం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన రూపాల్... గాయాల బారిన పడకుండా మెరుగైన ఫలితాలు సాధించడమే తన లక్ష్యమని పేర్కొంది. ‘పతకం సాధించడం ఆనందంగా ఉన్నా... ఫలితాలతో సంతృప్తిగా లేను. మరింత మెరుగైన టైమింగ్ సాధించాలనుకున్నా. దాని కోసం కఠోర సాధన చేస్తున్నా. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్న’ అని 20 ఏళ్ల రూపాల్ పేర్కొంది.
యూనుస్‌కు కాంస్యం
పురుషుల 1500 మీటర్ల పరుగులో యూనుస్ 3 నిమిషాల 43.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కజుటో లిజావా (3 నిమిషాల 42.56 సెకన్లు; జపాన్) వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి గెలుచుకోగా... జియాంగ్ లీ (3 నిమిషాల 42.79 సెకన్లు; దక్షిణ కొరియా) కాంస్యం దక్కించుకున్నాడు.

పురుషుల 400 మీటర్ల ఫైనల్లో విశాల్ వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ (45.57 సెకన్లు)తో రేసును ముగించినా... నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో పసిడి గెలిచిన భారత జట్టులో సభ్యుడైన విశాల... వ్యక్తిగత విభాగంలో మెరుగైన ప్రదర్శనే చేసినా పతకం మాత్రం సాధించలేకపోయాడు.
పూజకు రజతం
మహిళల 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ పూజ 4 నిమిషాల 10.83 సెకన్లలో గమ్యాన్ని చేరి రజతం నెగ్గింది. భారత్ కే చెందిన లిలి దాస్ (4 నిమిషాల 13.81 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది. లి చున్‌హి (4 నిమిషాల 10.58 సెకనర్లు; చైనా)కి పసిడి, టొమాకా కైమురా (4 నిమిషాల 11.56 సెకన్లు; జపాన్)కు కాంస్య పతకాలు దక్కాయి.

» ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. మహిళల హర్డిల్స్‌లో జ్యోతి 13.18 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ముందంజ వేసింది.
» మహిళల లాంగ్‌జంప్‌లో శైలీ సింగ్, ఆన్సీ సోజన్ ఫైనల్‌కు అర్హత సాధించారు. బుధవారం క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో శైలీ సింగ్ 6.17 మీటర్లు దూకగా... ఆన్సీ 6.14 మీటర్ల దూరం లంఘించింది.
ప్రవీణ్ మూడో ప్రయత్నంలో...
పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజత పతకంతో మెరిశాడు. బుధవారం పోటీల్లో ప్రవీణ్ 16.90 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ‘పరిస్థితులు అనుకూలించాయి. తొలి రెండు ప్రయత్నాల్లో టాప్–8లో ఉంటే చాలు అనుకున్నా.

మూడో ప్రయత్నంలో శక్తినంతా కూడదీసుకొని లంఘించా. ఆ తర్వాత వర్షం కారణంగా అంతరాయం కలగింది. దీంతో కాస్త ఇబ్బందిపడ్డా. పతకం సాధించడం సంతోషంగా ఉంది’ అని ప్రవీణ్ పేర్కొన్నాడు. తొలి ప్రయత్నంలో 16.60 మీటర్లు దూకిన ప్రవీణ్, రెండో ప్రయత్నంలో 16.67 మీటర్లు లంఘించాడు.
తేజస్విన్‌కు సిల్వర్
భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్‌లో రజతం గెలుచుకున్నాడు. 10 ఈవెంట్ల (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు) సమాహారమైన ఈ పోటీలో తేజస్విన్ 7618 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫై జియాంగ్ (7634; చైనా)కు స్వర్ణం, కిసుకే ఒకుడా (7602; జపాన్)కు కాంస్య పతకం లభించింది.
