మరో విజయంపై భారత్‌ కన్ను  | Sakshi
Sakshi News home page

Ind vs Aus, 2nd T20i: మరో విజయంపై భారత్‌ కన్ను 

Published Sun, Nov 26 2023 4:24 AM

India eyes on another victory - Sakshi

తిరువనంతపురం: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ ఇప్పుడు సిరీస్‌లో ఆధిపత్యం చాటేందుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో టి20లో ఆ్రస్టేలియాపై వరుసగా విజయం సాధించాలనే లక్ష్యంతో సూర్యకుమార్‌ సేన బరిలోకి దిగుతోంది.

మరో వైపు విశాఖపట్నంలో ఎదురైన పరాజయానికి ఇక్కడ బదులుతీర్చుకొని సిరీస్‌లో సమంగా నిలవాలనే పట్టుదలతో  ఆ్రస్టేలియా ఉంది. అనుభవం లేని ఆతిథ్య బౌలింగ్‌ను ఆసరా చేసుకొని రెచ్చి పోయే ప్రదర్శన కనబరచాలని కంగారూ సేన ఆశిస్తోంది. అయితే ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలం కావడంతో తొలి టి20లా ఇక్కడ భారీ స్కోర్ల మజా ఉండకపోవచ్చు. మెరుపులు తక్కువైనా... పోరు మాత్రం ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. 

బౌలర్లపైనే బెంగంతా! 
సీనియర్‌ బ్యాటర్లు లేకపోయినా... బ్యాటింగ్‌లో మాత్రం భారత్‌ పటిష్టంగా ఉంది. యశస్వి జైస్వాల్, ఇషాన్‌ కిషన్‌లు కంగారు పెట్టించే ఆసీస్‌ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. లక్ష్య ఛేదనలోనూ ధాటిని కొనసాగించారు. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ రనౌటైన రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా తనవంతు మెరుపులు మెరిపిస్తే తర్వాత వచ్చే కెప్టెన్ సూర్యకుమార్, తిలక్‌వర్మ, రింకూ సింగ్‌లు భారత ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లగలరు.

లోయర్‌ ఆర్డర్‌లో అక్షర్‌ పటేల్‌ రూపంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఉండటం, భారీ షాట్లతో విరుచుకుపడే సత్తా ఉండటం బ్యాటింగ్‌ దళానికి అదనపు బలమవుతుంది. ఏ రకంగా చూసిన బ్యాటర్లపై జట్టు మేనేజ్‌మెంట్‌కు ఏ అపనమ్మకం లేదు.

ఎటొచ్చి అనుభవంలేని బౌలింగ్‌తోనే సమస్యంతా! గత మ్యాచ్‌నే పరిశీలిస్తే ఒక్క ముకేశ్‌ కుమార్‌ మినహా ప్రధాన బౌలర్లుగా బరిలోకి దిగిన అర్ష్ దీప్, ప్రసిధ్‌కృష్ణలతో పాటు రవి బిష్ణోయ్, అక్షర్‌ పటేల్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం కలవరపెడుతోంది. అయితే ఇక్కడ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పట్టుసాధిస్తే మరో విజయం సులువవుతుంది. 

ఆల్‌రౌండ్‌ ప్రదర్శనపై ఆసీస్‌ గురి 
తొలి టి20లో ఆ్రస్టేలియా చక్కగా పరుగులు చేసింది. భారత్‌ లక్ష్య ఛేదనకు దిగితే ఆరంభంలోనే వికెట్లు తీసింది. కానీ ఆ తర్వాతే సూర్యకుమార్‌ నిలదొక్కుకోవడంతో కష్టాలపాలైంది. ప్రపంచకప్‌లో చెలరేగిన హెడ్, మ్యాక్స్‌వెల్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగే అవకాశముంది. దీంతో ఆ్రస్టేలియా బ్యాటింగ్‌ దళం మరింత విధ్వంసంగా మారిపోనుంది.

అనుభవజ్ఞుడైన స్మిత్, ఇంగ్లిస్, టి20 స్పెషలిస్టు టిమ్‌ డేవిడ్‌లతో భారత బౌలర్లకు ఇబ్బందులు తప్పవు. అయితే భారత్‌లాగే గతి తప్పిన బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకున్న ఆ్రస్టేలియా ఈ సారి మళ్లీ ఆ పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడాలనుకుంటోంది. కలిసొచ్చే వికెట్‌పై స్టొయినిస్, అబాట్, ఎలిస్, తన్విర్‌ సంఘా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తే తప్పకుండా అనుకున్న ఫలితం సాధించవచ్చు.  

జట్లు (అంచనా):
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), రుతురాజ్, ఇషాన్‌ కిషన్, యశస్వి, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్శ్‌దీప్, ముకేశ్, ప్రసిధ్‌ కృష్ణ. ఆ్రస్టేలియా: మాథ్యూ వేడ్‌ (కెపె్టన్‌), స్మిత్, షార్ట్‌ / హెడ్, ఇన్‌గ్లిస్, స్టొయినిస్‌ / మ్యాక్స్‌వెల్, టిమ్‌ డేవిడ్, అరోన్‌ హార్డి, అబాట్, నాథన్‌ ఎలిస్, బెహ్రెన్‌డార్‌్ఫ, తన్వీర్‌ సంఘా. 

పిచ్‌–వాతావరణం
గ్రీన్‌ఫీల్డ్‌ వికెట్‌ పేసర్లకు అనుకూలం. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు. ఆదివారం మ్యాచ్‌కు వానముప్పు అయితే లేదు. 

Advertisement
Advertisement