టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రో-కో టీమిండియా 2027 వరల్డ్‌కప్ ప్రణాళికల్లో కీలక భాగమని అధికారికంగా ధృవీకరించాడు. ఈ ప్రకటనతో రో-కో భవితవ్యంపై స్పష్టత వచ్చింది. వారి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు 2027 వరకు తమకు అలరిస్తారని తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు.
ఇంతకీ కోటక్ ఏమన్నాడంటే.. మేనేజ్‌మెంట్, రో-కో మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. కోచ్ గౌతమ్ గంభీర్‌తో వీరిద్దరూ తరచూ చర్చలు జరుపుతున్నారు. 2027 వరల్డ్‌కప్ ప్రణాళికలపై వీరి అనుభవం జట్టుకు మార్గదర్శకంగా ఉంటుంది.
వీరిద్దరూ చాలా ప్రొఫెషనల్. ప్రాక్టీస్, ఫిట్‌నెస్, ప్రణాళికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైతే ముందుగానే వేదికకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తారు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తారని కోటక్ అన్నాడు.
కోటక్ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కెరీర్ భవితవ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చాయి. రో-కో ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
ముఖ్యంగా విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. మొదటి వన్డేలో అతను 93 పరుగులు చేసి, తృటిలో మరో శతకాన్ని మిస్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ 26 పరుగులే చేసినా, క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.
ఇవాళ రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ రో-కో తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


