IND Vs ENG 1st ODI Highlights: బుమ్రా బౌలింగ్‌.. రోహిత్‌ బ్యాటింగ్‌; టీమిండియా ఘన విజయం

India Beat England By 10 Wickets 1st ODI - Sakshi

6 వికెట్లతో చెలరేగిన జస్‌ప్రీత్‌ బుమ్రా  

తొలి వన్డేలో 110 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌

10 వికెట్లతో భారత్‌ ఘన విజయం  

రేపు లార్డ్స్‌లో రెండో వన్డే

బుమ్రా వేసిన నాలుగో బంతి...రాయ్‌ వికెట్లపై ఆడుకున్నాడు...మరో రెండు బంతులకే రూట్‌ అవుట్‌...అతని రెండో ఓవర్లో కాస్త ప్రశాంతత... మరుసటి ఓవర్లో టెస్టు మ్యాచ్‌ హీరో బెయిర్‌స్టో ఖేల్‌ ఖతం...ఆ తర్వాతి ఓవర్లో లివింగ్‌స్టోన్‌ క్లీన్‌బౌల్డ్‌...ఆఖర్లో తిరిగొచ్చి మరో రెండు వికెట్లు...ఇదీ జస్‌ప్రీత్‌ చూపించిన జాదూ...మధ్యలో నేనూ ఉన్నాను అన్నట్లుగా షమీ జోరు...చక్కటి బంతితో స్టోక్స్‌ పని పట్టిన అతను, జట్టును రక్షించే ప్రయత్నం చేస్తున్న బట్లర్‌ను సాగనంపగా... మరో వికెట్‌తో ప్రసిధ్‌ కూడా పార్టీలో భాగమయ్యాడు.

ఆకాశం మబ్బులు పట్టి ఉంది, పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి ఫీల్డింగ్‌ ఎంచుకున్నానంటూ టాస్‌ సమయంలో రోహిత్‌ తమ పేసర్లపై ఉంచిన నమ్మకాన్ని వారు గొప్పగా నిలబెట్టారు. స్వింగ్‌తో చెలరేగిన మన పేసర్ల అద్భుత బౌలింగ్‌ ముందు ప్రపంచ చాంపియన్‌ తలవంచింది. లైనప్‌లో ఒక్కో ఆటగాడి పేరు, ఇటీవలి ఫామ్‌ చూస్తే ఈ టీమ్‌ కనీసం 350 పరుగులు చేస్తుందేమో అనిపించగా, వంద దాటేందుకు కూడా ఆపసోపాలు పడింది. అనంతరం భారత ఓపెనర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ 31.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆటను ముగించారు.

లండన్‌: ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ గెలుచుకున్న భారత్‌ వన్డే సిరీస్‌ను కూడా ఘనంగా ప్రారంభించింది. ఓవల్‌ మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.  

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. జోస్‌ బట్లర్‌ (32 బంతుల్లో 30; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా టాప్‌–6లో నలుగురు బ్యాటర్లు ‘డకౌట్‌’ కాగా, మొత్తంగా ఐదుగురు క్లీన్‌బౌల్డ్‌ కావడం విశేషం. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత్‌ బుమ్రా (6/19) చెలరేగగా... షమీకి 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 18.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) శిఖర్‌ ధావన్‌ (54 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు) వన్డేల్లో 18వ సారి శతక భాగస్వామ్యం నమోదు చేసి జట్టును గెలిపించారు. గజ్జల్లో గాయం కారణంగా కోహ్లి ఈ మ్యాచ్‌ ఆడలేదు. రేపు లార్డ్స్‌ మైదానంలో రెండో వన్డే జరుగుతుంది. 

టపటపా... 
ప్రత్యర్థి జట్టులో సత్తా ఉన్న బౌలర్లు, పదునైన స్వింగ్‌ ఉంటే సొంతగడ్డపై కూడా తాము బలహీనమేనని ఇంగ్లండ్‌ మరో సారి రుజువు చేసింది. బుమ్రా ఓవర్లో తొలి మూడు బంతులను ఎంతో కష్టంగా ఎదుర్కొన్న జేసన్‌ రాయ్‌ (0) దూరంగా వెళుతున్న తర్వాతి బంతిని వెంటాడి వెనుదిరిగాడు. ఆ తర్వాత అనూహ్యంగా పైకి ఎగసిన బంతిని ఆడలేక రూట్‌ (0) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. లోపలికి దూసుకొచ్చిన షమీ ఇన్‌స్వింగర్‌  స్టోక్స్‌ (0) ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోగా, పంత్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఇటీవల చెలరేగుతున్న బెయిర్‌స్టో (7) కూడా ఇంగ్లండ్‌ను ఆదుకోవడంలో విఫలం కాగా, ఏడు బంతుల్లో పరుగులు చేయలేని అసహనంతో బుమ్రా బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్‌ ఆడబోయిన లివింగ్‌స్టోన్‌ (0) కూడా క్లీన్‌బౌల్డయ్యాడు. 26కు సగం జట్టు పెవిలియన్‌ చేరగా...బట్లర్, మొయిన్‌ అలీ (14) భాగస్వామ్యంపై ఇంగ్లండ్‌ నమ్మకం పెట్టుకుంది. అయితే ఇదీ ఎంతో సేపు సాగలేదు. అలీని రిటర్న్‌ క్యాచ్‌తో ప్రసిధ్‌ అవుట్‌ చేయగా, బౌండరీ వద్ద సూర్యకుమార్‌ ఏకాగ్రత బట్లర్‌ వెనుదిరిగేలా చేసింది. కాస్త గౌరవప్రదమైన స్కోరు చేద్దామనుకున్న జట్టు ఆశలు ఈ వికెట్‌తో ముగిసిపోయాయి.  

అలవోకగా... 
ఛేదనలో భారత ఓపెనర్లు రోహిత్, ధావన్‌లకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడగా, ధావన్‌ మాత్రం జాగ్రత్త ప్రదర్శించాడు. ఒక్క ఇంగ్లండ్‌ బౌలర్‌ కూడా ప్రభావం చూపలేకపోవడంతో జట్టు లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ఒవర్టన్‌ వేసిన పదో ఓవర్లో రోహిత్‌ సిక్స్‌తో స్కోరు 50 పరుగులకు చేరింది.  ఆ తర్వాత కార్స్‌ ఓవర్లో సిక్సర్‌తో 49 బంతుల్లో రోహిత్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18వ ఓవర్లో స్కోరు వంద పరుగులు దాటింది. కార్స్‌ వేసిన 
ఓవర్లో పాయింట్‌ దిశగా ఫోర్‌ కొట్టి శిఖర్‌ ధావన్‌ మ్యాచ్‌ను ముగించాడు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (బి) బుమ్రా 0; బెయిర్‌స్టో (సి) పంత్‌ (బి) బుమ్రా 7; రూట్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) షమీ 0; బట్లర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) షమీ 30; లివింగ్‌స్టోన్‌ (బి) బుమ్రా 0; అలీ (సి) అండ్‌ (బి) ప్రసిధ్‌ 14; విల్లీ (బి) బుమ్రా 21; ఒవర్టన్‌ (బి) షమీ 8; కార్స్‌ (బి) బుమ్రా 15; టాప్లీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (25.2 ఓవర్లలో ఆలౌట్‌) 110. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–7, 4–17, 5–26, 6–53, 7–59, 8–68, 9–103, 10–110. బౌలింగ్‌: షమీ 7–0–31–3, బుమ్రా 7.2–3–19–6, హార్దిక్‌ 4–0–22–0, ప్రసిధ్‌ 5–0–26–1, చహల్‌ 2–0–10–0.
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (నాటౌట్‌) 76; ధావన్‌ (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లో వికెట్‌ నష్టపోకుండా) 114.  బౌలింగ్‌: విల్లీ 3–0–8–0, టాప్లీ 5–3–22–0, ఒవర్టన్‌ 4–0–34–0, కార్స్‌ 3.4–0–38–0, స్టోక్స్‌ 1–0–1–0, అలీ 2–0–9–0.

వన్డేల్లో భారత్‌ తరఫున బుమ్రా మూడో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. స్టువర్ట్‌ బిన్నీ (6/4), అనిల్‌ కుంబ్లే (6/12) తొలి రెండు  స్థానాల్లో ఉన్నారు.

వన్డేల్లో బుమ్రాకు ఇదే అత్యుత్తమ బౌలింగ్‌. గతంలో ఇది 5/27 (శ్రీలంక)గా ఉంది. 

వన్డేల్లో ఇంగ్లండ్‌కు భారత్‌పై ఇదే అత్యల్ప స్కోరు. ఇంగ్లండ్‌పై భారత్‌ 10 వికెట్లతో గెలవడం ఇదే మొదటిసారి కాగా, మిగిలిన బంతుల పరంగా (188) భారత్‌కు ఇది మూడో అతి పెద్ద విజయం.

ఓపెనర్లుగా 5 వేల పరుగులు జోడించిన నాలుగో జోడీగా రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ నిలిచారు. 

చదవండి: Rohit Sharma-Shikar Dhawan: రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్‌-ధావన్‌ ద్వయం అరుదైన ఫీట్‌

Steve Smith: 'ఇన్నేళ్ల నీ అనుభవం ఇదేనా స్మిత్‌.. సిగ్గుచేటు'
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top