source: X
మూడో టీ20లో టీమిండియా చేతిలో ఓడి, నిరాశగా ఉన్న వెస్టిండీస్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ప్లేయర్లు రోవ్‌మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. రెండో టీ20లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఇద్దరికి చెరో డీమెరిట్ పాయింట్ కేటాయించింది.
పావెల్ ఏం చేశాడంటే..?
రెండో టీ20లో పావెల్ మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో అతడు బ్యాట్‌తో బంతిని కొట్టి దూరంగా పంపించాడు. ఈ చర్యను ఐసీసీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకుంది.
రూథర్‌ఫోర్డ్ అసహనం
అదే మ్యాచ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో బంతిని వైడ్‌గా ప్రకటించకపోవడంతో రూథర్‌ఫోర్డ్ అంపైర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీన్ని నిబంధన ఉల్లంఘనగా పరిగణించిన ఐసీసీ చర్యలు తీసుకుంది.
తప్పును అంగీకరించిన పావెల్, రూథర్‌ఫోర్డ్
ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదనగోపాల్, రోహన్ పండిట్, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, ఫోర్త్ అంపైర్ వీరేందర్ శర్మ పావెల్, రూథర్‌ఫోర్డ్‌పై అభియోగాలు మోపారు. వారిద్దరు తమ తప్పులను అంగీకరించి, ఐసీసీ విధించిన శిక్షలను ఒప్పుకున్నారు.
కాగా, రెండో టీ20లో విండీస్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయం సాధించింది. అయితే నిన్న జరిగిన మూడో టీ20లో మాత్రం ఇంచుమించు అదే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తృటిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కూడా రూథర్‌ఫోర్డ్, మరో ఇద్దరు ఆటగాళ్లు అంపైర్ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై ఐసీసీ త్వరలోనే స్పందించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 'సిక్సర్ల' ప్రపంచ రికార్డు


