నితీశ్‌ రెడ్డికి ప్రమోషన్‌.. ధనాధన్‌ దంచికొట్టి.. అంతలోనే.. | IND vs WI 2nd Test Day 2: Nitish Reddy Misses 50, Shubman Gill Hits Half-Century | Sakshi
Sakshi News home page

శతకానికి చేరువలో గిల్‌.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి ధనాధన్‌.. అంతలోనే..

Oct 11 2025 11:47 AM | Updated on Oct 11 2025 12:12 PM

IND vs WI 2nd Test Day 2 lunch: Nitish Reddy Misses 50 Gill Half Century

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టీమిండియా (IND vs WI) అదరగొడుతోంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వైట్‌వాష్‌ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గిల్‌ సేన.. లక్ష్యం దిశగా పయనిస్తోంది. శనివారం నాటి రెండో రోజు ఆట భోజన విరామ సమయానికి 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

కాగా అహ్మదాబాద్‌ వేదికగా తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. ఢిల్లీలో విండీస్‌తో శుక్రవారం రెండో టెస్టు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌.. తొలిరోజు ఆటలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 318 పరుగులు చేసి ఆధిక్యం ప్రదర్శించింది.

డబుల్‌ సెంచరీ మిస్‌ చేసుకు న్న జైసూ
ఈ క్రమంలో 318/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 173 పరుగులతో ఆట మొదలుపెట్టిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal).. మరో రెండు పరుగులు జతచేసి దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయ్యాడు. దీంతో డబుల్‌ సెంచరీ చేయకుండానే జైసూ (175) నిష్క్రమించాడు.

నితీశ్‌ రెడ్డి ధనాధన్‌
అయితే, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ధనాధన్‌ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జోరు కనబరిచిన ఈ విశాఖ కుర్రాడు.. తృటిలో అర్ధ శతకాన్ని చేజార్చుకున్నాడు. 54 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. విండీస్‌ స్పిన్నర్‌ జొమెల్‌ వారికన్‌ అద్భుత బంతితో నితీశ్‌ రెడ్డిని వెనక్కి పంపాడు.

 

ఐదో నంబర్‌కు ప్రమోట్‌ అయి
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 108.3వ ఓవర్లో వారికన్‌ బౌలింగ్‌లో జేడన్‌ సీల్స్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌ రెడ్డి పెవిలియన్‌ చేరాడు. కాగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో నంబర్‌కు ప్రమోట్‌ అయి.. ధనాధన్‌ దంచికొట్టి ఇలా అతడు వెనుదిరగడం అభిమానులన నిరాశపరిచింది.

ఇక లంచ్‌ బ్రేక్‌ సమయానికి గిల్‌ 75 పరుగులు, ధ్రువ్‌ జురెల్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు అంటే తొలి రోజు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (38) విఫలం కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ శతకం (87) చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఇక విండీస్‌ తీసిన నాలుగు వికెట్లలో మూడు వారికన్‌ ఖాతాలోనే ఉన్నాయి. జైసూ రనౌట్‌తో విండీస్‌కు మరో కీలక వికెట్‌ దక్కింది.

చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్‌.. తప్పు నీదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement