శ్రీలంకతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నామమాత్రంగా రాణించారు. ఫలితంగా టీమిండియా 193 పరుగులకే ఆలౌట్ అయింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అర్ధ శతకం (66)తో ఆకట్టుకున్నాడు.
శ్రీలంక లక్ష్యం ఎంతంటే?
మిగిలిన వారిలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫర్వాలేదనిపించాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం లభించిన కారణంగా.. శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని విధించగలిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.
తొలి ఇన్నింగ్స్ ఇలా
ఈ క్రమంలో గాలె వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం (167) సాధించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలతో అలరించారు. మిగిలిన వారిలో యశస్వి జైస్వాల్ 32, రిషభ్ పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది.
భారీ ఆధిక్యంతో..
అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. 284 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలా ఒక వికెట్ కూల్చారు.
భారత బౌలర్లు లంకను నామమాత్రపు స్కోరుకే పరిమితం చేయడంతో.. భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 193 పరుగులకు ఆలౌట్ అయింది.
హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పంత్
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ 35 పరుగులు చేయగలిగాడు. పడిక్కల్ (44), పంత్ (66)రాణించగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (8), ధ్రువ్ జురెల్ (7), రవీంద్ర జడేజా (9), మానవ్ సుతార్ (9), కుల్దీప్ యాదవ్ (5), ప్రసిద్ కృష్ణ (2) సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశారు.
Rishabh Pant walks back after a typically flamboyant half-century. 🚶➡️
Watch #SLvIND, 1st Test | Day 4, LIVE NOW on Sony Sports Network channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/uBBiHTvsS8— Sony Sports Network (@SonySportsNetwk) August 18, 2026
శ్రీలంక బౌలర్లలో పేసర్ అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య మూడు వికెట్లు దక్కించుకున్నాడు. లాహిరు కుమార రెండు, కేశార నువాంత ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.


