నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ (238/7) చేసింది. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది.
ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.
అభిషేక్‌కు జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేసింది.
మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, ఇషాన్ కిషన్ 8, శివమ్ దూబే 9, అక్షర్ పటేల్ 5, అర్షదీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు.


