
ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. వన్డే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను యశస్వి ఉతికారేశాడు.
తన మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
51 ఏళ్ల రికార్డు బద్దలు
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఓపెనర్‌గా జైశ్వాల్ రికార్డులెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్ పేరిట ఉండేది. సుదీర్ నాయక్ 1974లో ఇదే మైదానంలో 77 పరుగులు చేశారు.
ఇప్పుడు తాజా మ్యాచ్‌తో నాయక్ పేరిట ఉన్న 51 ఏళ్ల రికార్డును జైశ్వాల్ బ్రేక్ చేశాడు. జైశ్వాల్, సుదీర్ తర్వాతి స్ధానాల్లో సునీల్ గవాస్కర్ (68), చేతేశ్వర్ పుజారా (66), చేతన్ చౌహాన్ (56) వంటి భారత ఓపెనర్లు ఉన్నారు.
సునీల్ గవాస్కర్ రికార్డుపై కన్ను..
భారత టెస్టు జట్టులో యశస్వి కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. 2023లో టెస్ట్ అరంగేట్రం చేసినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో రాణిస్తూ వస్తున్నాడు. కేవలం 21 టెస్ట్ మ్యాచ్‌ల్లోనే యశస్వి.. ఐదు సెంచరీలు, పన్నెండు అర్ధ సెంచరీలతో సహా 1,990 పరుగులు చేశాడు.
ఈ ముంబై ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లో 2000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 10 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అతడు 10 పరుగులు సాధిస్తే.. టెస్టుల్లో అత్యంతవేగంగా రెండు వేల పరుగులు చేసిన భారత ఆటగాడిగా గవాస్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.
సునీల్ గవాస్కర్ ఈ ఫీట్‌ను తన 23వ టెస్ట్‌లో నమోదు చేశారు. 1976 ఏప్రిల్ 7 నుండి 12 వరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఈ ఘనత సాధించారు.
చదవండి: SL vs BAN: 5 పరుగులు, 7 వికెట్లు: వన్డేల్లో శ్రీలంక ప్రపంచ రికార్డు