
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్‌లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్‌లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్‌లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.
ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్‌లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్‌తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది.
ఆలోపే భారత్‌తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.
ఆగస్ట్‌లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?
భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది.
ఇప్పటికే టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్‌లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.
ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది.
రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పారు.